Ap Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్, రైతులకు అధికారుల కీలక సూచనలు..

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Ap Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్, రైతులకు అధికారుల కీలక సూచనలు..

Ap Rains (Photo Credit : Google)

Updated On : December 9, 2024 / 6:30 PM IST

Ap Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాత్రికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని సూచించింది.

కోత కోసి పొలంలో ఉన్న పనలు వానకు తడిసినట్లు అయితే.. గింజ మొలెత్తకుండా ఉండటానికి ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలంది. పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలంది. ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలతో సపోర్ట్ అందించాలని వాతావరణ శాఖ సూచించింది.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యపు రాశులు వానకు తడవకుండా సమీప రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే టార్పాలిన్లను రైతులకు సమకూర్చాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వానలు పడే సమయంలో రైతులెవరూ పంట కోయకుండా వ్యవసాయ శాఖ సూచనలను అన్నదాతలంతా పాటించే విధంగా చూడాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

 

Also Read : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య.. టీడీపీ నుంచి ఎవరంటే?