AP Weather: బీకేర్ ఫుల్.. ఏపీలో రేపు భగభగలే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
AP Weather: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. తాజాగా విపత్తుల నిర్వహణ సంస్థ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
గురువారం రాష్ట్రంలో 43-44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. అల్లూరి, పోలవరం జిల్లాల్లోని 4 మండలాలకు వడగాలుల హెచ్చరిక ఇచ్చింది. శుక్రవారం 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందంది. ఇక, చిత్తూరు జిల్లా రాయలపేటలో అత్యధికంగా 43.7°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. తలకు క్యాప్ పెట్టుకోవడం లేదా గొడుగు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంది. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకపోవడమే మంచిదని చెప్పింది. అత్యవసరం అయితేనే అదీ జాగ్రత్తలు తీసుకుని ఎండలో బయటకు వెళ్లాలంది. ఇక, వడదెబ్బ బారిన పడకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. అటు అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read: వర్క్ ప్రమ్ హోమ్ పై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. రెండు రోజుల్లో
