APSDMA Alert: ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి.. నదీ పరీవాహక ప్రజలు జాగ్రత్త.. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు..
ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్ మేసేజ్ లు పంపిస్తున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్..

APSDMA Alert: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. రాత్రికి మొదటి హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. రేపు రాత్రి లేదా ఎల్లుండికి దాదాపు రెండవ హెచ్చరిక స్థాయికి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.
మరోవైపు గోదావరి నదికి పెద్ద మొత్తంలో వరద వస్తోందన్నారు. భద్రాచలం వద్ద 44.5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులుగా ఉందని, మొదటి హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించారు. రేపు దాదాపుగా 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు.
ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్ మేసేజ్ లు పంపిస్తున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
ఆదివారం ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం నాటికి ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
Also Read: సర్కార్‌కే చిక్కులు తెస్తారా.. అంటూ ఈ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారా?