Cyclone Fengal : ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు..! ఆ రెండు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్..
వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.

Cyclone Fengal (Photo Credit : Google)
Cyclone Fengal : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తుపానుగా మారనుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ, రేపు పుదుచ్చేరిలోని కారైకల్ లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. తమిళనాడులోని పుదుచ్చేరితో పాటు ఏపీలోనూ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం ఫెంగాల్ తుపాను తమిళనాడులోని నాగపట్టణం నుంచి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రాబోతోందని చెప్పారు. మరోవైపు తమిళనాడులోని తిరుచ్చి, రామనాథపురం, నాగపట్నం, కడలూరు, విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.
ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు అంటూ ఐఎండీ జారీ చేసిన హెచ్చరిక నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అలర్ట్ అయ్యారు. ముందుజాగ్రత్త చర్యలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తంజావూరు జిల్లాకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు. తిరువారూర్, మయిలాడుతురై, నాగపట్నం, కడలూరు జిల్లాల్లో రెండు బృందాలు (ఒకటి NDRF, మరొకటి రాష్ట్రం నుండి) పంపబడ్డాయి.
మైలాడుతురై, తిరువారూర్, నాగపట్నం, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగెల్‌పేట్, కడలూరు సహా పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
అటు తుపాను ప్రభావంతో గురువారం (నవంబర్ 28న) కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, గుంటూరు, ఏలూరు, ఉభయగోదారి జిల్లాలు, అనకాపల్లి, మన్యం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.