Cyclone Fengal : తుపాను బీభత్సం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భీకర వర్షాలు..!

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు సైతం అలర్ట్ గా ఉండాలన్నారు.

Cyclone Fengal : తుపాను బీభత్సం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భీకర వర్షాలు..!

Cyclone Fengal (Photo Credit : Google)

Updated On : November 30, 2024 / 7:19 PM IST

Cyclone Fengal : ఫెంగల్ తుపాను ఏపీని వణికిస్తోంది. విజయనగరం, విశాఖ, నెల్లూరు, తిరుమలలో జోరు వానలు కురుస్తున్నాయి. ఫెంగల్ ఎఫెక్ట్ తో తిరుమలలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి తిరుమలలో ఈదురు గాలులతో కూడిన వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల మొత్తం పొగమంచు కమ్మేయడంతో చలితీవ్రత కూడా పెరిగింది. దీంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు.

ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తుపాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు సైతం అలర్ట్ గా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అటు అధికారులు సైతం అలర్ట్ గా ఉంటూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఇక, విజయనగరం జిల్లాలోనూ ఫెంగాల్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఫెంగల్ తీవ్రతతో విజయనగరం జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. గజపతినగరం, మెంటాడ, బొమ్మపల్లి, దత్తిరాజేరు మండలాల్లో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావంతో పలు చోట్ల వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. వరి కుప్పల దగ్గర వాన నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇక కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మైలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విడుపరం జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపించారు. ప్రస్తుతం చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను.. కారైకాల్-మహాబలిపురం మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంతటా దాదాపు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరికొన్ని గంటల్లో తుపాను తీరాన్ని తాకనుంది. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండగం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫెంగల్ తుపాను వాతావరణ శాఖ అంచనాలు తలకిందులు చేస్తూ ముందుకు సాగుతోంది.

Also Read : తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు- టీటీడీ వార్నింగ్