TTD : తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు- టీటీడీ వార్నింగ్
తిరుమల పవిత్రతను కాపాడటం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది.

TTD Warning (Photo Credit : Google)
TTD : తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మికత వాతావరణాన్ని దెబ్బతీసేలా పొలిటికల్ కామెంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. తిరుమలకు వచ్చిన పలువురు రాజకీయ నాయకులు దర్శనం తర్వాత మీడియాతో రాజకీయ విమర్శలు చేస్తున్నారని టీటీడీ తెలిపింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందంది.
తిరుమల పవిత్రతను కాపాడటం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇటీవలే తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ టీటీడీ తీర్మానం చేయగా, నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చింది.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వ్యాఖ్యలు చేస్తారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఇకపై తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని టీటీడీ తేల్చి చెప్పింది. శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. స్వామి వారి దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చి మీడియాతో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రమైన రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం కానీ, రాజకీయ వ్యాఖ్యలు చేయటం కానీ నిషేధం విధించాలని పాలక మండలి తీర్మానించినట్లు వెల్లడించారు. ఇప్పటి నుంచి అది అమల్లోకి వస్తుందని టీటీడీ తెలిపింది. ఇక నుంచి ఎవరైనా తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇకపై వీఐపీలు ఎవరైనా శ్రీవారి ఆలయం ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
వాస్తవానికి తిరుమల మాడ వీధులన్నీ నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామి వారిపైనే తమ ధ్యాస ఉంచుతారు. భక్తి తన్మయత్వంతో పులకించిపోతారు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలను ఖండించడం జరిగింది.
తిరుమలకు వచ్చే రాజకీయ నాయకులు రాజకీయ వ్యాఖ్యలు చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇకపై తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై నిషేధం విధిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మికతను పరిరక్షించేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అంటున్నారు.
Also Read : ఈ కేసు కాకపోతే మరొకటి.. కొడాలి నానిని మాత్రం వదిలేది లేదంటున్న కూటమి సర్కార్..!