AP Rains: ఏపీకి వర్ష సూచన.. 5 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

మోస్తరు నుంచి భారీ వానలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AP Rains: ఏపీకి వర్ష సూచన.. 5 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Updated On : July 19, 2025 / 6:37 PM IST

AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. రాబోయే 5 రోజులు ఏపీలో విస్తారంగా వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వానలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇక రేపు (జూలై 20) పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు అధికారులు. నిన్న చాలా ప్రాంతాల్లో వాన పడింది. మోస్తరుగా మొదలైన వర్షం దంచి కొట్టింది. వానల కారణంగా ఏర్పడే వరదలు, జలమయం అయ్యే ప్రాంతాల్లో ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రంలో రేపు (జూలై 20), ఎల్లుండి (జూలై 21) పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.

Also Read: తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 5 రోజులు వానలే వానలు..

ఆదివారం (20-07-2025) ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం..
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం.

సోమవారం (21-07-2025) ఈ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్..
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.