Hot Summer : వామ్మో ఇవేం ఎండలు..! నిప్పుల కుంపటిలా తెలంగాణ, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Telangana Hot Summer
Hot Summer : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. దీంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లూరులో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలతో పాటు వచ్చే నెల మే అంతా కూడా రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిన్న చాలా చోట్ల 44 డిగ్రీలకుపైగా పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి వాతావరణంలో అనేక మార్పుల కారణంగా భానుడు భగభగ మండిపోతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వారం రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎండల తీవ్రత కారణంగా జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పగటి పూట జన సంచారం తగ్గింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటి పూట బయటకు రావాల్సి వస్తే.. వడదెబ్బకు గురి కాకుండా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : ఎండలు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఆ జిల్లాల్లో ఐదు రోజులు డేంజర్ బెల్స్