AP Rains: ఏపీలో పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదన్నారు.
Representative Image (Image Credit To Original Source)
AP Rains: ఏపీలో వానలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే సమయంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదన్నారు. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
Also Read: కర్ణాటకలో వడగళ్ల వాన.. బిల్ గేట్సే కారణమంటున్న నెటిజనులు.. అసలేం జరిగిందంటే..
