Heat wave: బీ కేర్ఫుల్.. ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు.. ఈ వ్యాధులున్న వారు బయటకు రావొద్దు..!
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వడగాలులు ప్రభావం చూపే ఛాన్స్ ఉందన్నారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Weather Updates Hot Summer In Ap Temperatures
AP Heat Wave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతోంది. భానుడు భగభగ మండిపోతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. శనివారం 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక, ఆదివారం (ఏప్రిల్ 12) ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు ప్రభావం చూపుతాయని తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వడగాలులు ప్రభావం చూపే ఛాన్స్ ఉందన్నారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా తరుచూ నీళ్లు తాగాలని సూచించారు. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిదన్నారు.
ఆదివారం శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం.. విజయనగరం జిల్లా సంతకవిటి, వంగర మండలాలు.. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సీతంపేట, వీరఘట్టం మండలాలు.. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం.. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో (19) తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. సోమవారం మొత్తంగా 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
శనివారం కడప జిల్లా పొట్టిపాడులో 44.7°C, నెల్లూరు (జి) కొమ్మిపాడులో 44.3°C, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 44.2°C, నంద్యాల (జి) గోస్పాడు, ప్రకాశం (జి) కొప్పెరపాడులో 42.8°C, కర్నూలు (జి) మంత్రాలయంలో 42.7°C, మార్కాపురం (జి) నందన మారెళ్లలో 42.2°C, అనంతపురం (జి) రాయదుర్గం, చిత్తూరు (జి) సింధురాజపురంలో 42.1°C, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడు 41.9°C, శ్రీసత్యసాయి (జి) కొత్తచెరువులో 41.6°C, పల్నాడు (జి) గురజాలలో 41.2°C, మన్యం (జి) భామినిలో 41.1°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపి పెట్టుకోవాలని, గొడుగు వాడాలని, తెలుపు రంగు కాటన్ వస్త్రాలే ధరించాలన్నారు. అదే విధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. గుండె సంబంధ వ్యాదులు, షుగర్, బీపీ ఉన్న వారు ఎండలో తిరగరాదని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
Also Read: సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చు! SIPలో నెలకు ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. పూర్తి లెక్కలివే..!
