తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

  • Published By: murthy ,Published On : November 24, 2020 / 01:38 PM IST
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

rains with nivar cyclone : బంగాళా ఖాతంలో ఏర్పడిని తీవ్రవాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది. అది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో నివర తుఫాను కేంద్రీకృతమైంది. ఇది మ‌రో నాలుగు గంట‌ల్లో తీవ్ర తుఫానుగా మారుతుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) స్ప‌ష్టం చేసింది.

దీనిప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు, రాయ‌లసీమ‌లోని చిత్తూరు జిల్లాల్లో ప‌లుచోట్ల మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.
ఈనేప‌థ్యంలో తీరంవెంబ‌డి ఉన్న జిల్లాల‌ను ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది.



https://10tv.in/cyclone-nivar-to-hit-south-andhra-pradesh-coast-wednesday/
తెలంగాణాలోనూ వర్షాలు 
కాగా, తెలంగాణ‌లో కూడా రాబోయే మూడు రోజుల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, అందుకు సిద్ధంగా ఉండాల‌ని సూచిస్తూ ఐఎండీ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ తుఫాను ప్ర‌భావం త‌మిళ‌నాడు, పుదుచ్చేరిపై అధికంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తున్న‌ది. ‌ఇప్ప‌టికే త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి.



తమిళనాడులో ముందస్తు రక్షణ చర్యలు
మామళ్లాపురం-కారైకాల్ మధ్య నివర్ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో తీర ప్రాంత జిల్లాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

తుపానుపై సమీక్షించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం తమిళనాడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో ఫోనులో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే కేంద్ర సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రధాని ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని తెలియజేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.



కాగా, ముందస్తు జాగ్రత్తగా తమిళనాడు తీరంలో రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సముద్రం కల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఒక ప్రకటనలో కోరారు.

బస్సులు,రైళ్లు రద్దు
కాగా తమినాడులోని 11 జిల్లాల్లో బస్సు సర్వీసులను మంగళవారం మధ్నాహ్నం ఒంటి గంట నుంచి రద్దు చేశారు. కాగా, వర్షాలు పడతాయని అంచనా వేస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, కీలకమైన డాక్యుమెంట్లను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.



నివర్ తుపాను దూసుకువస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, తొమ్మిది రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 24-25 తేదీల్లో చెన్నై ఎగ్మోర్-పాండిచ్చేరి మధ్య భువనేస్వర్-పుదుచ్చేరి-భువనేశ్వరి రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 25న పుదుచ్చేరి-విల్లిపురం మధ్య పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపింది.



నివర్ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమిళనాడు, పుదుచ్చేరిలో 30 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు. 12 బృందాలను ఇప్పటికే అందుబాటులో ఉంచగా, 18 టీమ్‌లను రిజర్వ్‌లో ఉంచామని ఎన్‌డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు న్యూఢిల్లీలో తెలిపారు.