తెలంగాణలో కరోనా టీకా పడింది.. పారిశుద్ధ్య కార్మికురాలితో ప్రారంభం

తెలంగాణలో కరోనా టీకా పడింది.. పారిశుద్ధ్య కార్మికురాలితో ప్రారంభం

COVID-19 Vaccination In Gandhi Hospital : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సినేషన్ ను నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అంతకుముందు..శనివారం ఉదయం 10.30గంటలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కరోనా టీకాను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గాంధీలో మంత్రి ఈటల ఆధ్వర్యంలో తొలి టీకాను పారిశుధ్య కార్మికురాలికి టీకా వేశారు.

తెలంగాణలో 139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. దీన్ని త్వరలోనే 1,213 సెంటర్లకు విస్తరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.15 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్ల వివరాలను కో-విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసినట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఒక్కో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో 30 మందికి చొప్పున ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. వారంలో నాలుగు రోజులు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్‌ యాప్‌ ద్వారా సమాచారం పంపారు. వైద్య సిబ్బంది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్‌ ప్రక్రియను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజులపాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్‌ సోకకుండా అడ్డుకుంటాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా టీకా వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ టీకా వేయరు. కరోనా సోకకుండా అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. కాబ్టటి వైరస్‌ సోకిన రోగులకు టీకా వేయరు.