ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 07:05 AM IST
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు

అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తుంటే జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, లబ్దిదారులకు పథకాలు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పథకాల నిధులు నిలుపుదల చేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. పసుపు-కుంకుమ పథకం డబ్బులు మహిళలకు అందకుండా కుట్రలు పన్నుతున్నారని.. వృద్ధుల పెన్షన్లపైనా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : సీఎం చంద్రబాబే.. పవర్ మాత్రం లేదు : సీఎస్ వ్యాఖ్యల కలకలం

విజయసాయి రెడ్డి దుర్మార్గమైన భాష వాడుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ పై బయటకు వచ్చి ఆర్థిక ఉగ్రవాదులుగా మారిపోయారని అన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. టీటీడీ బంగారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ చట్టాలను ఉల్లంఘించిన జగన్, విజయ్ సాయి రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పై కేసులు వేసి ఇబ్బందులు పెడుతుంటే… జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని దేవినేని ఉమ నిలదీశారు. గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని అన్నారు. జగన్‌ వెయ్యి కోట్లకు కక్కుర్తిపడి.. కేసీఆర్‌ కుట్రలకు సహకరిస్తున్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. శ్రీవారి బంగారంతో వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం దారుణం అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా.. శ్రీవారి బంగారంపై రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు. శ్రీవారి బంగారం బ్యాంకుల్లో భద్రంగా ఉందని.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ లెక్కల రూపంలో చెప్పారని దేవినేని ఉమ వెల్లడించారు.
Also Read : ఇంటర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నాని ట్వీట్ : చదువంటే మార్కులే కాదు