మావోల దాడి : 16 మంది పోలీసులు మృతి

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 08:29 AM IST
మావోల దాడి : 16 మంది పోలీసులు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది.కురికెడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను తరలిస్తున్నారు. పేలుడు అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.డీజీపీ,గడ్చిరోలి ఎస్పీతో తాను టచ్ లో ఉన్నట్లు సీఎం తెలిపారు. మంగళవారం రాత్రి పురాందా-మాలేగావ్‌-యెర్కడ్‌ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 36 వాహనాలకు నక్సల్స్‌ నిప్పుపెట్టారు. ఈ నిర్మాణ పనులను అమర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే సంస్థ చేస్తోంది.

ఈ కంపెనీకి దాదాపూర్‌లో దాదర్‌ ప్లాంట్‌ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్‌లోనే నిలిపి ఉంచారు. ఈ ప్లాంట్‌లోకి మావోయిస్టులు చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నేడు ‘మహారాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు ఇలాంటి దాడులకు పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 
Also Read : పెను తుఫాన్ గా ఫోని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు