రాజధాని అమరావతే : సీఎం జగన్ ఆ రోజే చెప్పారట

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 06:35 AM IST
రాజధాని అమరావతే : సీఎం జగన్ ఆ రోజే చెప్పారట

Updated On : August 23, 2019 / 6:35 AM IST

ఏపీ రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే వార్తలు చర్చకు దారితీశాయి. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై అనుమానాలను పెంచాయి. రాజధాని మార్పు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేపిటల్ ని ప్రకాశం జిల్లా దొనకొండకి షిఫ్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో రాజధాని ప్రాంతానికి చెందిన రైతుల్లో అయోమయం నెలకొంది.  వారు ఆందోళనలో పడిపోయారు. కొందరు రైతులు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. రాజధానిని తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని తరలింపు ప్రకటనలపై రైతులు కన్నాతో చర్చించారు. మంత్రుల ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయని వాపోయారు. ప్రభుత్వం కౌలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులతో మాట్లాడిన కన్నా.. వారి విజ్ఞప్తులు విన్నారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేదన్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచుతామని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారని కన్నా గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిర్ణయం మార్చుకోవడం కరెక్ట్ కాదన్నారు.

రాజధాని కోసం రైతులు తమ భూములిచ్చారని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాజధాని మార్పుపై అనుమానాలు నెలకొన్నాయని, భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారని కన్నా చెప్పారు. రాజధానిపై సీఎం జగన్ స్పందించాలని, స్పష్టత ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు. అమరావతిలోనే రాజధానిని ఉంచి అభివృద్ధి చేయాలన్నారు.