Botcha Satyanarayana: ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది.. ఓటేసిన పాపానికి.. ప్రజాస్వామ్యం ఎక్కడుంది?- కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్
రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారని, కూటమికి రక్షకులుగా వ్యవహరిస్తున్నారని బొత్స అన్నారు.

Botsa Satyanarayana
Botcha Satyanarayana: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓ చోట ఓట్లను మరో చోట బూత్ లు ఏర్పాటు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక పోలింగ్ సెంటర్లను ఎలా మారుస్తారని నిలదీశారు. ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి గెలవదని తేల్చి చెప్పారు. విశాఖ, విజయవాడలో పబ్లిక్ గానే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పోతోందన్నారు. కూటమి పాలకులు, పోలీసులు కుమ్మక్కయారని బొత్స ఆరోపించారు.
రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆయన వాపోయారు. ప్రభుత్వం సామాన్య ప్రజానీకం సమస్యలపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఓటేసిన పాపానికి ప్రజలు అనుభవించాల్సిందే అన్న రీతిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ.
రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారని, కూటమికి రక్షకులుగా వ్యవహరిస్తున్నారని బొత్స అన్నారు. ఈ 14 నెలల కాలంలో ఎన్నో నేరాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందన్న బొత్స.. తుంగలో తొక్కారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రావడం దురదృష్టకరమన్నారు.
కూటమి ప్రభుత్వం అరాచకాలను ఖండిస్తున్నామన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. కూటమి నాయకులు ప్రజల్లో తిరగడానికి భయపడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ.
Also Read: ఎన్నిక ఏదైనా వైసీపీని వెంటాడుతున్న ఆ కేసు.. ఈసారి ఎంత డ్యామేజ్ చేస్తుందో అని టెన్షన్..!