కేసీఆర్ ప్రాజెక్టుల బాట : కొంత సంతృప్తి..మరికొంత అసంతృప్తి

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 01:26 AM IST
కేసీఆర్ ప్రాజెక్టుల బాట : కొంత సంతృప్తి..మరికొంత అసంతృప్తి

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట కొనసాగుతోంది. నూతన సంవత్సరం రోజు నుండి ఆయన రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తొలి రోజు కాళేశ్వరం మేడిగడ్డ, కన్నేపల్లి ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు. పనితీరుపై అధికారులు, కాంట్రాక్టర్లకు క్లాస్ తీసుకున్న కేసీఆర్…పనుల్లో వేగం పెంచాలంటూ ఆదేశించారు. జనవరి 02వ తేదీ బుధవారం అన్నారం, సుందిళ్ల, ఎస్సారెస్పీ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. 

ఇలా అయితే ఎలా ? 
ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కేసీఆర్ కొంత సంతృప్తి..మరికొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నత్తనడకన సాగితే ఎలా? ఇలా అయితే అనుకున్న సమయానికి పూర్తి చేయగలమా ? అంటూ ప్రశ్నించారు. నిర్దేశించుకున్న గడువులోగా ప్రజలకు నీళ్లివ్వాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో నేరుగా మేడిగడ్డ చేరుకున్న కేసీఆర్ బ్యారేజ్ పనులు పరిశీలించారు. దాదాపు గంటసేపు అక్కడే గడిపారు. పది నిమిషాల పాటు ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలించారు. అధికారుల సమాధానాలతో సంతృప్తి చెందని  సీఎం…నేరుగా పనులను తనిఖీ చేశారు. బ్యారేజి నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ఎల్అండ్‌టీ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కన్నెపల్లిలో…
నీటి ప్రవాహం కారణంగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. మేడిగడ్డ నాలుగవ పంప్ హౌస్ లో పనులపై ఆరా తీసిన సీఎం.. త్వరగా గేట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలంటూ కీలక సూచనలు చేశారు. అనంతరం కన్నెపల్లి చేరుకున్న కేసీఆర్ అక్కడి పంపు హౌజ్‌ పనులను చూశారు. 

బుధవారం…
సీఎం కేసీఆర్ రెండో రోజు (జనవరి 2, బుధవారం) కాళేశ్వరం, దాని అనుబంధ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పనులు మంగళవారమే పరిశీలించాల్సి ఉన్నా…ఆలస్యం కావడంతో బుధవారానికి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరందించే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్  పునరుజ్జీవం పనులను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. రాజేశ్వర్రావు పేట, రాంపూర్ లో నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ పనులను అడిగి తెలుసుకోనున్నారు.