Amit Shah in South: అమిత్‌షా ఏమన్నారో విన్నారా.. సౌత్‌లో బీజేపీకి 80 ఎంపీ సీట్లు సాధ్యమేనా?

బీజేపీకి అంగ, అర్ధ బలాలు.. సంస్థాగత నిర్మాణం ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఏమాత్రం క్యాడర్ బలంలేని తమిళనాడు, కేరళల్లో ఎలా గెలుస్తుందనేది పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుబట్టడం లేదు.

Amit Shah in South: అమిత్‌షా ఏమన్నారో విన్నారా.. సౌత్‌లో బీజేపీకి 80 ఎంపీ సీట్లు సాధ్యమేనా?

Amit Shah in Southern States: బీజేపీ దక్షిణాదిపై భారీ ఆశలు పెట్టుకుంటోంది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 129 ఎంపీ స్థానాల్లో 80 సీట్లు గెలవాలనేది బీజేపీ (BJP) టార్గెట్. 2024 జరిగే సార్వత్రిక సంగ్రామం (2024 Lok Sabha election)లో మళ్లీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ.. దక్షిణాదిపై భారీ అంచనాలు పెట్టుకోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. సౌత్‌లో బీజేపీకి ప్రస్తుతం 29 మంది ఎంపీల బలం ఉంది. కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu), ఏపీల్లో ఒక్క ఎంపీ కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో 80 సీట్లు గెలుస్తామనని కలమనాథులు ధీమా ప్రదర్శిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.

విన్నారా తమిళనాడులో 25 మంది ఎంపీలను గెలిపించి.. మరోమారు మోదీని ప్రధాని చేయమని కోరుతున్నారు అమిత్‌షా.. ఒక్కసీటు లేని.. సంస్థాగతంగా సరైన బలం లేని తమిళనాడులో 25 మంది ఎంపీలను ఎలా గెలుచుకుంటారు? అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఏపీలో ఏమన్నారో చూడండి..

విశాఖ సభలో అమిత్‌షా చెప్పినదాన్ని జాగ్రత్తగా విన్నారా? ఏపీలో 20 స్థానాల్లో బీజేపీని గెలిపించాలట. రాజకీయ పార్టీ అన్నాక ఆ మాత్రం ఆశ పెట్టుకోవడం సహజమే.. గెలుస్తామనే పోటీ చేయాలి? చేస్తారు కూడా.. కానీ, ఏ మాత్రం బలం లేనిచోట తిరుగులేని సంఖ్యలో గెలుస్తామనడం హెచ్చులకు పోవడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు.

తమిళనాడు, ఏపీయే కాదు.. దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాలపైనా భారీగా ఆశలు పెంచుకుంటోంది బీజేపీ. ఉత్తరాదిలో.. ముఖ్యంగా హిందీ బెల్డ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరు. పైగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అంతకు తగ్గ బలం కూడా ఉంది. కానీ, ఏ మాత్రం బలం.. బలగం లేని చోట భారీ ఆశలు పెట్టుకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దక్షిణాదిలో మొత్తం 129 స్థానాలు ఉన్నాయి. ఐదు ప్రధాన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరితో కలిపి దక్షిణాదిగా వ్యవహరిస్తారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో… బీజేపీ గట్టిగా ఉన్నది ఒక్క కర్ణాటకలోనే.. తెలంగాణలో బలమైన నాయకత్వం ఉన్నా.. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సమర్థులైన నాయకులు లేక.. చేరికలపై ఆశలు పెంచుకుంటోంది. ఇలాంటి తరుణంలో 80 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకోవడమే అతిశయం అనిపించుకోగా.. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల వారీగా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తామో లెక్కలు చెప్పడమే ఆశ్చర్య పరుస్తోంది.

దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి బీజేపీకి 25 మంది ఎంపీల బలం ఉంది. అయితే గతనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది కాషాయపార్టీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న స్థానాలు నిలబెట్టుకోవడం డౌటే.. లోక్‌సభ ఎన్నికలనాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చి కమలం కోలుకుంటుందని భావించినా.. దక్షిణాదిలోని మిగతా స్థానాలను ఎలా నిలబెట్టుకుంటుందనేదే ఇక్కడ ప్రశ్న. దక్షిణాదిలో ప్రస్తుతం ఉన్న 29 స్థానాల్లో కర్ణాటకలో 25 అయితే మిగిలినవి 4 తెలంగాణలో గెలిచింది బీజేపీ.. ఈ రాష్ట్రంలో మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు మూడు నెలలకే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో గెలవాలంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఇప్పడున్న పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో ఎలా నెగ్గుకొస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read: అవినీతిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో నిజంలేకపోతే వాటిపై సీబీఐ ఎంక్వయిరీ కోరండి..

బీజేపీకి అంగ, అర్ధ బలాలు.. సంస్థాగత నిర్మాణం ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఏమాత్రం క్యాడర్ బలంలేని తమిళనాడు, కేరళల్లో ఎలా గెలుస్తుందనేది పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుబట్టడం లేదు. ఏపీలో కూడా సేమ్ సీనే కనిపిస్తోంది. ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు ఉన్నా.. గత ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఏపీలో 20 సీట్లు గెలుస్తామని ఆశిస్తున్న బీజేపీ ఈ నాలుగేళ్ల ఏపీలో బలపడటానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.

Also Read: హైదరాబాద్ లో రాజమౌళి, ప్రభాస్‭తో భేటీకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా?

రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షించే గ్లామర్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అదీ లేదు. జనసేనాని పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉందని చెబుతారే గాని.. రెండు పార్టీలు ఎప్పుడూ కలిసిపనిచేయలేదు. రాష్ట్ర బీజేపీ నేతలతో విసిగిపోయిన జనసేనాని.. టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోయారు. ఇక రాష్ట్ర బీజేపీకి.. టీడీపీకి మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యం. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎంపీ స్థానాలు గెలుస్తుందని లెక్కలేసినా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీతో దోస్తీకి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో ఏడాదిలో జరిగే ఎన్నికల్లో 20 ఎంపీ స్థానాలను గెలుస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్త చేయడం అతి విశ్వాసమే అవుతుందని అంటున్నారు విమర్శకులు.

కర్ణాటక, ఏపీ, తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. వివరాలకు ఈ వీడియో చూడండి..