Rayachoti Constituency: రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు.. దీటైన అభ్యర్థి కోసం టీడీపీలో తర్జనభర్జనలు

బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ.

Rayachoti Constituency: రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు.. దీటైన అభ్యర్థి కోసం టీడీపీలో తర్జనభర్జనలు

Rayachoti Assembly Constituency Ground Report

Rayachoti Assembly Constituency: రాయచోటి పేరు చెబితే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డే గుర్తుకువస్తారు. గడికోటకు కంచుకోటగా మారింది రాయచోటి. ముందు కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి (Gadikota Srikanth Reddy) ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) కు అత్యంత సన్నిహితుడు. ఈ హాట్‌సీట్‌లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ. వైసీపీలో శ్రీకాంత్‌రెడ్డే కింగ్.. ఆయనకు ప్రత్యర్థి వెతికే పనిలో టీడీపీ చాలా బిజీగా ఉంది. బలిజ ఓట్లు ప్రభావం ఎక్కువగా ఉండే రాయచోటిలో ఎవరిని పోటీకి పెడితే బాగుంటుందో తేల్చుకోలేకపోతోంది తెలుగుదేశం.. ప్రస్తుత ఇన్‌చార్జికి బదులుగా మరికొందరి పేర్లు పరిశీలిస్తోంది. ఇన్నాళ్లు వార్ వన్‌సైడ్‌ అన్నట్లు రాజకీయం నడిచిన రాయచోటిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి? శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు?

ఒకప్పుడు కడప జిల్లా (Kadapa district) రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి.. ఇప్పుడు అన్నమయ్య జిల్లా (Annamayya district) కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే.. 1955లో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో కాంగ్రెస్ వెనకబడినా.. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది. తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా.. అసెంబ్లీలో సమర్థంగా తన వాణి వినిపించిన శ్రీకాంత్‌రెడ్డి.. వైఎస్ మరణం తర్వాత జగన్‌తోనే నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్‌రెడ్డి. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు శ్రీకాంత్‌రెడ్డి.

Sugavasi Prasad Babu

సుగవాసి ప్రసాద్‌బాబు (photo: facebook)

రాయచోటి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 31 వేల 637 ఓట్లు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ 95 వేల పైచిలుకు ఓట్లు సాధించి విజయఢంకా మోగించింది వైసీపీ. 2004లో ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండ్రాయుడు… 2009లో యువకుడైన శ్రీకాంత్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు (Sugavasi Prasad Babu) చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ, శ్రీకాంత్‌రెడ్డిపై అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్డప్పగారిపల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి (Srinivasa Reddy Reddeppagari)ని పోటీలోకి దింపింది టీడీపీ. వరుసగా రెండు ఎన్నికల్లోనూ రమేశ్‌కుమార్‌రెడ్డే పోటీ చేశారు. సుమారు 60 వేల పైచిలుకు ఓట్లు సాధించిన రమేశ్‌కుమార్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Gadikota Srikanth Reddy

గడికోట శ్రీకాంత్‌రెడ్డి (photo: facebook)

ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మళ్లీ గడికోట శ్రీకాంత్‌రెడ్డే పోటీ చేయనున్నారు. ఏదైన అద్భుతం జరిగితే తప్ప.. ఆయన మారే అవకాశం లేదు. అధిష్టానంలో పట్టుతోపాటు.. జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల శ్రీకాంత్‌రెడ్డి స్థానం సుస్థిరంగా చెబుతున్నారు. నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంలోనూ శ్రీకాంత్‌రెడ్డి ప్రభావం ఎక్కువ. సీనియర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికీ పెద్దపీట వేశారు శ్రీకాంత్‌రెడ్డి. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మరోమారు గెలవడం ఖాయమంటున్నారు శ్రీకాంత్‌రెడ్డి.

Also Read: వేడి పుట్టిస్తున్న రాప్తాడు రాజకీయాలు.. పరిటాల అడ్డా అని రుజువు చేస్తారా?

Ramesh Kumar Reddy Reddappagari

రెడ్డప్పగారిపల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి (photo: facebook)

ఈ సీటుపై టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. ఇప్పటికే రెండుసార్లు పోటీచేసి ఓటమి చవిచూసిన రమేశ్‌కుమార్‌రెడ్డి మళ్లీ మరోమారు పోటీచేయాలని తహతహలాడుతున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి (Srinivasa Reddy Reddeppagari) నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి టిక్కెట్ గ్యారెంటీ అని చెబుతున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా… బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తే మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్‌బాబును బరిలోకి దింపే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడైన ప్రసాద్‌బాబు అవకాశం వస్తే సత్తా చూపాలని భావిస్తున్నారు. అయితే ఈయనను రాజంపేట ఎంపీగా కూడా పోటీ చేసే ఆలోచన చేస్తోంది టీడీపీ అధిష్టానం. ప్రసాద్‌బాబుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే.. రమేశ్‌కుమార్‌రెడ్డి శాసనసభకు పోటీ చేసే చాన్స్ ఉంది. అదేసమయంలో ప్రసాద్‌బాబునే ఎమ్మెల్యేగా పోటీకి దింపాలని భావిస్తే.. రమేశ్‌కుమార్‌రెడ్డిని రాజంపేట ఎంపీగా పోటీలో దింపొచ్చనే టాక్ కూడా ఉంది. ఇక వీరిద్దరికి పోటీగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కూడా టిక్కట్ ఆశిస్తున్నారు. ఈయన ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Srinivasa Reddy Reddeppagari

రెడ్డప్పగారిపల్లి శ్రీనివాసరెడ్డి (photo: facebook)

ఈ సారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న టీడీపీలో టిక్కెట్ కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా రమేశ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌బాబుల మధ్య గ్రూప్‌వార్ నడుస్తోంది. ఇది పార్టీకి చేటు చేస్తుందేమోనని క్యాడర్ భయపడుతున్నారు. వీరిద్దరి మధ్యలో రాంప్రసాద్‌రెడ్డి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కానీ, ఈ నియోజవకర్గంలో గ్రూప్ వార్ తగ్గించడానికి ఒకరిని ఎంపీగా.. ఇంకొకరిని ఎమ్మెల్యేగా బరిలో దింపొచ్చు. ఏదైనా సరే ఈ సారి రాయచోటిలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని అంటున్నారు రమేశ్‌కుమార్‌రెడ్డి.

Also Read: అనంతపురంలో పవన్ పోటీ చేస్తే జనసేన, వైసీపీ మధ్యే పోటీ.. లేదంటే అంత ఈజీ కాదు!

బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ. బలిజ ఓట్ల కోసం సుగవాసి ప్రసాద్‌బాబుకు చాన్స్ ఇస్తే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపీగా బరిలో దింపే అవకాశం కనిపిస్తోంది. రమేశ్‌కుమార్‌రెడ్డి కుటుంబంలో.. శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి.. ఏ స్థానానికి పోటీ చేస్తారో తేలితే.. మిగతా సమీకరణాలు అన్నీ మారతాయనే అభిప్రాయం ఉంది. వైసీపీలో మాత్రం ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డే మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ. ఆయనకు దీటైన అభ్యర్థిని బరిలో దింపే విషయంపైనే టీడీపీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. చివరికి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నందున.. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.