YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.

YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

Chittoor YCP: ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో వారసుల సందడి బాగా ఎక్కువైంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కన్ఫార్మ్‌ అన్నట్లు జరుగుతున్న ప్రచారంతో.. అధికార పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ వారసులను తెరపైకి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము తప్పుకుని తమ పిల్లలతో పోటీ చేయించాలని తహతహలాడుతున్నారు. ఈ లిస్టు రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.. ఇంతకీ అధికార పార్టీలో వారసుల సంగతేంటి? సిట్టింగ్‌ ఎమ్మెల్యేల తెరచాటు వ్యూహాలేంటో తేల్చేద్దాం..

రాజకీయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెబుతుంటారు. ఒక్కోసారి ఓ నిర్ణయంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఏపీ సీఎం జగన్ తీసుకున్న అలాంటి నిర్ణయమే అధికార వైసీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసులకు అవకాశం లేదని తేల్చిచెప్పిన సీఎం జగన్.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం మినహాయింపు ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్న చెవిరెడ్డి తన స్థానంలో తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy)ని బరిలోకి దింపాలని చూస్తున్నారు. సీఎం జగన్ అనుమతి తీసుకుని.. కుమారుడిని నియోజకవర్గంలో తిప్పుతున్నారు. ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్న మోహిత్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. మోహిత్‌రెడ్డికి టిక్కెట్ కన్ఫార్మ్ అయిందని జరుగుతున్న ప్రచారంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చాలా మంది శాసనసభ్యులు తమ పిల్లలను కూడా తెరపైకి తేవాలని ప్రయత్నాలు ఆరంభించారు. చెవిరెడ్డికి దక్కిన అవకాశం తమకెందుకు దక్కదని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ లిస్టులో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి (Tirupati) నుంచి భూమన కుమారుడు అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy) ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా తన కుమార్తె కృపాలక్ష్మి (Krupa Lakshmi) కి తన రాజకీయ వారసత్వం అప్పగించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ కుమార్తె పవిత్ర రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ కూడా ఎమ్మెల్యేలు కావాలని తహతహలాడుతున్నారు. సుమన్ ప్రస్తుతం జడ్పీటిసి సభ్యుడిగా ఉన్నారు.

Also Read: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?

ఎమ్మెల్యేలు ఈ విధంగా ఒత్తిడి తెస్తుండగా.. తాను మాత్రం ఎందుకు తగ్గాలని అనుకున్నారో ఏమో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం తన సోదరుడు కుమారుడైన పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డినీ వచ్చే ఎన్నికల్లో పోటీకి పెట్టాలని చూస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు నేతలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు. ఏ అవకాశం ఉన్నా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి భావిస్తున్నారు. వైసీపీలో పెద్దిరెడ్డి ప్రముఖ నేత.. చిత్తూరు జిల్లా వరకు ఆయనే సూపర్ పవర్.. అలాంటిది పెద్దిరెడ్డి కూడా మరో టిక్కెట్ ఆశిస్తుండటంతో సీఎం జగన్ ఇరకాటంలో పడినట్లు చెబుతున్నారు.

Also Read: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..

ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. అందరూ కూడా చెవిరెడ్డికి దక్కిన అవకాశాన్నే ఉదాహరణగా చూపెడుతుండటంతో వైసీపీ పెద్దలకు తలబొప్పి కడుతోందట. చెవిరెడ్డి వారసుడికి టిక్కెట్ ఇస్తారో… లేదో కానీ ప్రస్తుతానికి పెద్ద తలనొప్పిగా మారడాన్ని బహుశా సీఎం కూడా ఊహించి ఉండరని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Also Read: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?