Supreme Court: ఎఫ్ఐఆర్ చేయమని కోర్టు చెప్పాక 14 రోజులు ఏం చేశారు? మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్, శోభా గుప్తా, బృందా గ్రోవర్ కూడా వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు సంధించారు. హింసపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని పేర్కొన్నారు

Supreme Court: ఎఫ్ఐఆర్ చేయమని కోర్టు చెప్పాక 14 రోజులు ఏం చేశారు? మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

Manipur Violence: మణిపూర్ హింసకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme court) పదునైన ప్రశ్నలు వేసింది. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మహిళలపై మే ప్రారంభం నుంచి జరుగుతున్న అమానుషాలపై ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారని, అయితే మే 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తాము ఆదేశించామని, అయితే 14 రోజులైనా పోలీసులు ఎందుకు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోమవారం విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐ, సిట్‌కు దర్యాప్తు అప్పగించినంత మాత్రన సరిపోదని, బాధిత మహిళలకు సత్వర న్యాయం అందేలా చూడాలని, ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయని పేర్కొంది. ఇంతవరకూ ప్రభుత్వం ఏమి చేసిందనే దానిపైనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే విషయం ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందినట్లయితే తాము జోక్యం చేసుకోవాల్సి అవసరం ఉంటుందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. అయితే కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ.. మణిపూర్ హింసపై జరుగుతున్న విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టిన అనంతరం సుప్రీంకోర్టు స్వయంగా ఈ విచారణను పర్యవేక్షిస్తోంది. అయితే ఈ విషయమై అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిలో మే 4న జరిగిన ఘటనలో వేధింపులకు గురైన ఇద్దరు మహిళల పిటిషన్లు కూడా ఉన్నాయి. వారి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. దర్యాప్తును సీబీఐకి అప్పగించరాదని అన్నారు. సుప్రీంకోర్టు తన తరపున సిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్, శోభా గుప్తా, బృందా గ్రోవర్ కూడా వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు సంధించారు. హింసపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు ముందు మహిళల్లో వాంగ్మూలాలు ఇచ్చేందుకు ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ఉందని ఇందిరా జైసింగ్ అన్నారు. ఇందుకోసం మహిళా సామాజిక కార్యకర్తలతో కూడిన ఉన్నతాధికార కమిటీని అక్కడికి పంపాలని సూచించారు.

మణిపూర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై విచారణ కొనసాగనుందని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మైతీ కమ్యూనిటీ తరఫు న్యాయవాదికి కూడా విచారణ న్యాయమైందపి హామీ ఇచ్చింది. ‘‘ఏ సంఘంపై హింస జరిగినా, దానిని సీరియస్‌గా తీసుకుంటాం. పిటిషనర్లలో ఎక్కువ మంది కుకీ వర్గానికి చెందిన వారే కావడం వాస్తవమే. వారి లాయర్లు తమ వాదనను నిలబెట్టుకుంటున్నారు. అయితే మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం’’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ క్రింది ప్రశ్నలను అడిగింది:
* నమోదైన 6000 ఎఫ్‌ఐఆర్‌ల వర్గీకరణ ఏమిటి?
* మహిళలపై నేరాలకు సంబంధించి ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి?
* ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి?
* ఒక్కో కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
* ఎంత మందిని అరెస్టులు చేశారు?

ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా చర్చించిన అంశాల ప్రకారం ఈ అంశాలపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
* బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు మాజీ మహిళా న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేయవచ్చు.
* బాధిత మహిళల్లో విశ్వాసం పెంపొందించేందుకు మహిళా సామాజిక కార్యకర్తలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయవచ్చు.
* సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షించడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
* మాజీ డీజీపీ స్థాయి అధికారులతోనూ సిట్‌ను ఏర్పాటు చేయవచ్చు.