AP Volunteers: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

ఐదు వేల వేతనానికే ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వలంటీర్లు.. పది వేలు అందుకంటే మరింత విధేయత చూపిస్తారనేది అధికార పార్టీ వ్యూహం.

AP Volunteers: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

AP Volunteers

AP Volunteers Salaries: ఏపీ రాజకీయాల్లో వలంటీర్ల వ్యవస్థపై విస్తృత చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా? వలంటీర్ల వేతనాలను (volunteers salaries) రెండింతలు చేయాలని జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా? ఐదు వేల రూపాయల వేతనంతో పనిచేస్తున్న వలంటీర్లకు బంఫర్ ఆఫర్ (Bumper Offer) ఇవ్వనుందా? ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే వ్యవస్థగా ప్రభుత్వం భావిస్తున్న వలంటీర్లకు సీఎం జగన్ (CM Jagan) ఇచ్చే కానుక ఏంటి?

సీఎం జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు ఐదు వేల రూపాయల వేతనం అందిస్తోంది ప్రభుత్వం. వలంటీర్లు తమ పరిధిలో ఉన్న 50 ఇళ్లల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయడంతోపాటు.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం.. సచివాలయం ద్వారా ప్రభుత్వ సేవలను అందజేయడం వలంటీర్ల విధి. ఇలాంటి వ్యవస్థలో కొన్ని లోపాలు జరుగుతున్నాయని.. ముఖ్యంగా డేటా చోరీతోపాటు, మహిళల భద్రత ప్రమాదకరంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్. వారాహి యాత్రలో పవన్ చేసిన ఈ కామెంట్లతో ఏపీలో రాజకీయం రచ్చరచ్చగా మారింది. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తడమే కాదు.. పవన్‌ క్షమాపణ చెప్పాలంటూ రోడ్డెక్కారు వలంటీర్లు. కోర్టులో పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు.. వలంటీర్లపై అధ్యయనం చేశా: పవన్ కల్యాణ్

ఈ ఎపిసోడ్‌తో పవన్‌పై విమర్శలు దాడి చేసిన వైసీపీ.. వలంటీర్లను ఓ శక్తిగా మార్చుకుందని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే మహాశక్తి వలంటీర్లకే ఉందని భావిస్తున్న సీఎం జగన్.. వలంటీర్లను ఇంకా పార్టీకి దగ్గర చేయాలని నిర్ణయించారట. ఐదు వేల రూపాయల వేతనాన్ని డబుల్ చేయాలని నిర్ణయించారట సీఎం జగన్. తన పుట్టిన రోజు కానుకగా డిసెంబర్‌లో ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్న జగన్.. అందుకు తగ్గట్టు నిధుల సమీకరణకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Also Read: పోలీసులతో చంద్రబాబు కేసులు పెట్టించారు.. అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నా

జనసేనాని-పవన్ మధ్య జరిగిన మాటల యుద్ధంలో కేవలం ఐదు వేల రూపాయలకే గొడ్డు చాకిరీ చేయిస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా ఒక్కసారిగా సగానికి సగం వేతనం పెంచి వలంటీర్లను మరింత శక్తివంతమైన సైన్యంగా తయారుచేసుకోవాలని భావిస్తున్నారు సీఎం జగన్. డిసెంబర్‌లో ఈ నిర్ణయంపై ప్రకటన చేస్తే.. జనవరి నుంచి అమలు అవుతుంది. అప్పటికి మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడతాయి.. అంటే ప్రస్తుతానికి పెద్దగా ఆర్థిక భారం లేకపోయినా.. ఎన్నికల్లో ఎక్కువగా ప్రయోజనం జరిగే అవకాశం ఉందనేది వైసీపీ ఆలోచన. ఐదు వేల వేతనానికే ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వలంటీర్లు.. జీతాలు పెంచితే మరింత విధేయత చూపిస్తారనేది అధికార పార్టీ వ్యూహం. ఈ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో గాని.. వలంటీర్ల వేతనాలు డబుల్ అనే టాక్ ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది.