Sathupalli: టీడీపీ సీటులో కారు జోరు చూపించగలదా.. హస్తవాసి ఎలా ఉంది?

గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినా.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంతో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

Sathupalli: టీడీపీ సీటులో కారు జోరు చూపించగలదా.. హస్తవాసి ఎలా ఉంది?

Telangana elections 2023 who will win in sathupalli constituency

Sathupalli Assembly constituency ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీఐపీ నియోజకవర్గం సత్తుపల్లి.. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం.. ఎందరో నేతలకు రాజకీయ జన్మనిచ్చింది. జలగం కుటుంబంతోపాటు సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి వంటి నేతల సొంత నియోజకవర్గం కూడా సత్తుపల్లే. దీంతో ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ నియోజకవర్గం నుంచి గత మూడు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది.. ఇప్పుడు కూడా సత్తుపల్లిలో టీడీపీ ప్రధాన రాజకీయ శక్తిగానే కనిపిస్తోంది. టీడీపీ సీటులో కారు జోరు చూపించగలదా? హస్తవాసి ఎలా ఉంది? సత్తుపల్లి రేసుగుర్రం ఎవరు?

హేమాహేమీల సొంత నియోజకవర్గం సత్తుపల్లి.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తుపల్లిలో ఇతర వర్గాల నేతలు పోటీచేసే చాన్స్ లేకపోయినా.. ఎన్నికల్లో గెలుపోటములను శాసించేది మాత్రం ఇతర సామాజిక వర్గాల నేతలే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 2019లో అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. 2009 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు సండ్ర.

Sandra Venkata Veeraiah

Sandra Venkata Veeraiah

1978లో ఏర్పడింది సత్తుపల్లి నియోజకవర్గం. అంతకుముందు వేంసూరు నియోజకవర్గంగా ఉండేది. 1952లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన జలగం వెంగళరావు… ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వెంగళరావు కుటుంబానికి నియోజకవర్గంలో మంచిపట్టు ఉంది. గత ఎన్నికల్లో వెంగళరావు కుమారుడు ప్రసాదరావు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నా ఈ నియోజకవర్గంలో పసుపుపార్టీ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ క్రమంగా ఉనికి కోల్పోయినా.. ఇప్పటికీ ఆ పార్టీకి నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. క్షేత్రస్థాయి బలంతో ఈ ఎన్నికల్లోనూ పోటీకి రెడీ అవుతోంది టీడీపీ..

Sambani Chandrashekar

Sambani Chandrashekar

గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినా.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంతో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులు ఏర్పడటంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటికి సత్తుపల్లే సొంత నియోజకవర్గం కావడంతో వారిద్దరి అనుచరులను ఇక్కడి నుంచి పోటీకి దింపాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్, గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన మట్టా దయానంద్, పీసీసీ మెంబర్ మానవతారాయ్, పొంగులేటి ప్రధాన అనుచరుడు కొండూరు సుధాకర్ సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి సంభాని మాత్రం హైకమాండ్ అండదండలతో టికెట్ తనదేననే నమ్మకంతో ఉన్నారు.

Matta Dayanand

Matta Dayanand

సంభానికి టికెట్ వస్తుందో? రాదో గాని కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు మాత్రం క్యాడర్‌ను భయపెడుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుడిగా ముద్రపడిన సీనియర్ నేత మట్టా దయానంద్.. ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే సండ్ర బీఆర్ఎస్లో ఉండటం.. ఆయనకే టికెట్ దక్కడంతో పొంగులేటి కన్నా ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు దయానంద్. ఆ తర్వాత పొంగులేటితోపాటు కోండూరు సుధాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేసిన సుధాకర్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పొంగులేటితో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Also Read: పొత్తులపై కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా.. ఎందుకీ పరిస్థితి?

ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. మాజీ మంత్రి సంభాని, దయానంద్, సుధాకరే కాకుండా పీసీసీ సభ్యులు మానవతారాయ్ కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉండటంతో కాంగ్రెస్ లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. టికెట్ దక్కని వారు పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తారేమోననే టెన్షన్ పడుతోంది కాంగ్రెస్ క్యాడర్.. ఏది ఏమైనా టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు మట్టా దయానంద్.. కుల ధ్రువీకరణ వివాదం మైనస్‌గా భావిస్తే తన భార్య రాగమయికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దయానంద్.

Also Read: హోరాహోరీగా సూర్యాపేట రాజకీయం.. కాంగ్రెస్ తలరాత మారుతుందా?

కాంగ్రెస్‌లో గ్రూపులతో అధికార బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఎమ్మెల్యే సండ్రతోపాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తే విజయం సాధించే పరిస్థితి ఎలా ఉన్నా.. ఆ పార్టీ చీల్చే ఓట్లు బీఆర్ఎస్‌ను దెబ్బతీస్తాయేమోననే ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు రెండూ గెలుపు కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ నుంచి నంబూరి రామలింగేశ్వరరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, సత్తుపల్లి నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ బలం లేదు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ కనిపిస్తోంది.. ఈ పోటీలో ఎవరు విజేతలో డిసెంబర్ 3నే తేలనుంది.