Mohammed Shami: నా సక్సెస్ సీక్రెట్ ఇదే.. అవి చాలా ముఖ్యం మహ్మద్ షమీ

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ లో దుమ్మురేపుతున్నాడు. తన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటో షమీ వెల్లడించాడు.

Mohammed Shami: నా సక్సెస్ సీక్రెట్ ఇదే.. అవి చాలా ముఖ్యం మహ్మద్ షమీ

Mohammed Shami reveals secret behind ODI world cup storm

Mohammed Shami టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ దూసుకుపోతున్నాడు. లేటుగా వచ్చినా రికార్డులతో ఇరగదీస్తున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి మరోసారి సత్తా చాటాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకోవడంతో పాటు పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (45) పడగొట్టిన బౌలర్ గా రికార్డు సాధించాడు. జహీర్ ఖాన్(44), జవగళ్ శ్రీనాథ్(44)ను దాటేసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు ప్రపంచకప్ లో అత్యధికంగా ఏడు సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్ గానూ ఘనతకెక్కాడు.

శ్రమకు దక్కిన ఫలం
షమీకి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ప్రపంచకప్ కు కొద్ది రోజుల ముందు వ్యక్తిగత సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాడు. కోర్టు కేసులతో సతమతమయ్యాడు. అయితే వాటి నుంచి త్వరగా బయటపడి ఎంతో పట్టుదలతో మైదానంలో మళ్లీ తానేంటో కొత్తగా నిరూపించుకున్నాడు. టీమిండియా పేసర్ల టాప్ త్రయంలో కీలకంగా మారాడు. అందుకు తగ్గట్టుగానే  ఎంతో శ్రమించాడు. అందుకే శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత షమీ చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను ప్రస్తుతం ఈ స్థాయికి చేరడానికి కారణమైన తన దైవం అల్లాకు వినమ్రంగా ధన్యవాదాలు తెలిపాడు. తన శ్రమ ఫలించి రిథమ్ అందుకోవడానికి అల్లాయే కారణమని చెప్పాడు.

సొంతూరులో ప్రాక్టీస్
ప్రపంచ కప్ కు చాలా రోజుల ముందు వరకు షమీ అసలు జట్టులోకి వస్తాడా, రాడా అనే చర్చ నడిచింది. జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అతడికి మొదటి మూడు మ్యాచుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆలస్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా.. వచ్చిన చాన్స్ ను సద్వినియోగం చేసుకుని చెలరేగుతున్నాడు. దీనికోసం షమీ ఎంతో శ్రమించాడు. తన సొంతూరులో వివిధ రకాల పిచ్‌లపై గంటల తరబడి అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేశాడు. దాని కారణంగానే ఇప్పుడు ఇరగదీస్తున్నాడు. ధర్మశాలలో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టి ఎంట్రీని ఘనంగా చాటాడు. టీమిండియాకు తానెంత విలువైన బౌలర్ నో చాటిచెప్పాడు.

Also Read: ప్రపంచ కప్ లో శుభ్‌మాన్ గిల్ సెంచరీ మిస్.. సారా టెండూల్కర్ స్పందన వైరల్‌

అవే ముఖ్యం
బంతిని సరైన దిశలో సంధించడమే తన సక్సెస్ సీక్రెట్ అని షమీ తెలిపాడు. “ఎప్పటిలాగే బంతిని మంచి రిథమ్ తో సరైన ప్రాంతాల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో లయను కోల్పోతే దాన్ని తిరిగి సాధించడం చాలా కష్టం. అందుకే టోర్ని ప్రారంభం నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ముఖ్యంగా వైట్ బాల్‌ కరెక్ట్ ఏరియాలో పడితే పిచ్ నుంచి కచ్చితంగా సహకారం అందుతుంది. అంతే తప్ప ఇదేమీ రాకెట్ సైన్ కాదు. రిథమ్, మంచి ఆహారం, మైండ్ ను ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ప్రజల ప్రేమ కూడా ముఖ్యమ”ని షమీ వివరించాడు.