Chennai Floods: ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. అతలాకుతలమైన మహానగరం

వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సీఎం స్టాలిన్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Chennai Floods: ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. అతలాకుతలమైన మహానగరం

చెన్నై మహానగరం ఇంకా వరద నుంచి కోలుకోలేదు. వర్షాలు తగ్గినా ఇంకా వరద ముంపులోనే ఉంది. చెరువులను తలపిస్తున్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కూడా సహాయ సామగ్రిని పంపిణీ చేస్తోంది. గురువారం చెన్నైకి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. తమిళనాడుకు రెండో విడత సాయంగా 450 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

మిగ్‌జామ్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సానికి చెన్నై నగరం మొత్తం అతలాకుతలమైంది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో నగరం మొత్తాన్ని వరద నీరు ముంచెత్తింది. చాలా కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. రిలీఫ్‌ ఆపరేషన్స్‌ కొనసాగిస్తున్న ప్రత్యేక బృందాలు.. ఇప్పటికి 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. యశోద వైద్యులు ఏం చెప్పారంటే?

వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సీఎం స్టాలిన్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. తమిళనాడును ఆదుకునేందుకు రెండో విడతగా 450 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధాని ఆదేశించినట్లు చెప్పారాయన.

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేస్తున్నారు. సీఎం స్టాలిన్‌ పలు ప్రాంతాల్లో బాధితులకు సరుకులు పంపిణీ చేశారు. మరోవైపు.. చెన్నై సిటీకి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కూడా ఆపన్న హస్తం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు హెలికాఫ్టర్‌తో పరిస్థితిని సమీక్షిస్తున్న ఎయిర్‌ ఫోర్స్ సిబ్బంది.. ఇప్పటి వరకు 2 వేల 300 కిలోల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు..

భారీ వర్షాల కారణంగా చెన్నైలోని రోడ్లు, బ్రిడ్జిలు, ప్రభుత్వ భవనాలు, ఇతర సౌకర్యాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. చెన్నైని ఆదుకునేందుకు 5 వేల కోట్ల సాయం అందించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.