కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కన్ఫూజన్‌.. అయోమయంలో నేతలు

వ‌రంగ‌ల్ పార్లమెంట్ నుంచి అద్దంకి ద‌యాక‌ర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ అద్దంకి ద‌యాక‌ర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదంటున్నారు.

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కన్ఫూజన్‌.. అయోమయంలో నేతలు

telangana congress mp candidates selection process confuse leaders

Telangana Congress MP Candidates Selection: పార్లమెంట్‌ బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరు? 17 స్థానాలకు 33 మంది డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం గందరగోళానికి దారితీస్తోందా? అభ్యర్థుల పేర్లను డీసీసీ ప్రతిపాదిస్తే.. పీసీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది? అంటే ఆశావహులు తమ దరఖాస్తులను డీసీసీ ద్వారా సమర్పించాలా? నేరుగా పీసీసీనే సంప్రదించాలా? లేకుండా డైరెక్ట్‌గా అధిష్టానమే అభ్యర్థులను ఫైనల్‌ చేస్తుందా? తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహామేంటి?

ఒకరి పేరునే మూడు స్థానాల‌కు..
వచ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలవాని తెలంగాణ కాంగ్రెస్ క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థుల ఎంపిక‌ చేస్తామ‌ని ప్రక‌టించింది ఇప్పటికే ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ రేసుగుర్రాల అన్వేషణకు అనుసరిస్తున్న విధానం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. అభ్యర్థుల‌ ఎంపికపై ముందు డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రతిపాద‌న‌లు తీసుకుంది పీసీసీ. ఇలా మొత్తం 17 స్థానాల‌కు 33 జిల్లాల డీసీసీ అధ్యక్షులు 187 పేర్లను ప్రతిపాదించడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒక పార్లమెంట్ రెండు, మూడు జిల్లాల ప‌రిధిలో విస్తరించడంతో డీసీసీ అధ్యక్షులు ఎవరికివారే తమ పరిధిలో అభ్యర్థుల పేర్లపై ప్రతిపాదనలు పంపారు. ఇలా ఒకేస్థానానికి ఇద్దరు, ముగ్గురు డీసీసీ అధ్యక్షులు మూడు నాలుగు పేర్లు పంపి కొత్త చర్చకు తెరతీశారు. ఇంకా విచిత్రమేంటంటే.. వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఒకరి పేరునే మూడు స్థానాల‌కు ప్రతిపాదించారు. సీనియర్‌ నేత, వ‌రంగ‌ల్ ఎస్సీ రిజర్వుడు స్థానంతోపాటు త‌న ప‌రిధిలో లేని నాగ‌ర్ క‌ర్నూల్ నియోజకవర్గానికి, మ‌ల్కాజిగిరి జ‌న‌ర‌ల్ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి స‌ర్వే స‌త్యనారాయణ పేరును ప్రతిపాదించారు ఎర్రబెల్లి స్వర్ణ.

అధిష్టానం హామీ ఇచ్చిన నేతల పేర్లేలేవీ?
ఇదేసమయంలో పార్లమెంట్ ఎన్నిక‌ల్లో సీరియ‌స్‌గా పోటీ చేస్తార‌నే ప్రచారంలో ఉన్న నేతల పేర్లను, గతంలో అధిష్టానం హామీ ఇచ్చిన నేతల పేర్లను ఏ డీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదించకపోవడం విశేషం. ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్ కుమారుడు గ‌డ్డం వంశీ పెద్దప‌ల్లి నుంచి పోటీ చేస్తార‌ని పెద్దఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. కానీ ఆ పార్లమెంట్ ప‌రిధిలోకి వ‌చ్చే ఏ ఒక్క జిల్లా అధ్యక్షుడు వంశీ పేరును సిఫార్సు చేయలేదు. అదేవిధంగా వ‌రంగ‌ల్ పార్లమెంట్ నుంచి అద్దంకి ద‌యాక‌ర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఆయనకు టికెట్‌ కన్ఫార్మ్‌ అయిందని అసెంబ్లీ ఎన్నికల్లోనే హామీ ఇచ్చారనే టాక్‌ నడుస్తోంది. కానీ అద్దంకి ద‌యాక‌ర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆస‌క్తిక‌రంసగా పక్కపార్టీల నేతల పేర్లను కొందరు డీసీసీ అధ్యక్షులు పార్లమెంట్‌ అభ్యర్థులుగా సిఫార్సు చేస్తున్నారు. మ‌హ‌బూబాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాములు కుమారుడు జీవ‌న్‌లాల్ పేరు ఆ జిల్లా అధ్యక్షుడు భ‌ర‌త్‌చంద్రారెడ్డి ప్రతిపాదించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Also Read: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఫిబ్రవ‌రి 3 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ
ఇవన్నీ ఇలా కొనసాగుతుండగానే… ఆశావహులు పీసీసీకి దరఖాస్తులు చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ద‌ర‌ఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, విక‌లాంగులైతే దరఖాస్తుతోపాటు 25 వేల రూపాయ‌ల డీడీ, మిగ‌తావ‌ర్గాల‌ వారు 50 వేల రూపాయ‌ల డీడీ జ‌త‌ప‌ర‌చాల‌ని సూచించారు సీఎం. ఫిబ్రవ‌రి 3 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఒకవైపు డీసీసీల నుంచి పేర్లు తీసుకుని.. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోమనడం గందరగోళంగా మారింది. అసలు జిల్లా అధ్యక్షుల ప్రతిపాదనలను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారా.. లేక పీసీసీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి పేర్లనే పరిశీలిస్తారా? అన్న కన్ఫూజన్‌లో చిక్కుకున్నారు ఆశావహులు.

Also Read: లోక్‌సభ ఎన్నికల రేసులో భట్టి విక్రమార్క భార్య నందిని.. గాంధీ భవన్‌లో కొనసాగుతున్న అప్లికేషన్ల స్వీకరణ

అనేక సందేహాలు
ప్రజాస్వామ్యయుతంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంద‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన విధానం పరిశీలిస్తే.. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న నేతల పేర్లను మాత్రమే ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటామ‌ని చెప్పారు. కానీ ఎటువంటి దరఖాస్తు చేసుకోని 30 మందికి పార్టీ భి-ఫామ్‌ల‌ను అందజేశారు. కొందరు ముందురోజు పార్టీలో చేరి మరునాడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ అనుభవంతో పీసీసీకి దరఖాస్తు చేసుకునే కన్నా.. పెద్దల వద్ద పైరవీలకే ఎక్కువమంది నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు.