జాగ్రత్త.. జగన్‌ని నమ్ముకుంటే మీరు జైలుకే- వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక

జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు.

జాగ్రత్త.. జగన్‌ని నమ్ముకుంటే మీరు జైలుకే- వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్‌ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకి పోవాలని హెచ్చరించారు చంద్రబాబు.

వేంకటేశ్వర స్వామిని రాజకీయాలకు, పైరవీలకు వాడుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుపతిని దొంగ ఓట్ల కేంద్రంగా చేశారని ఆరోపించారు చంద్రబాబు. అన్నీ ఆ స్వామి చూస్తున్నాడని హెచ్చరించారు. ”ఊరిలో ఓట్ల దొంగలు పడ్డారు. మీ ఓట్లను ఓసారి చూసుకోండి. ఐ ప్యాక్ కంపెనీ ద్వారా ఆన్ లైన్ లో ఓట్లు మాయం చేస్తున్నారు. వీరిపై సీబీఐ దర్యాప్తు జరపాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు.

చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ మృతి ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ”చిత్తూరులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఇవాళ గణేష్ అనే కానిస్టేబుల్ ను స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి చంపారు. స్మగ్లర్లు రాజులు అవుతుంటే ఇలానే జరుగుతుంది. టీడీపీ హయాంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? స్మగ్లర్లపై ఐదేళ్లు ఉక్కుపాదం మోపాం. ఇప్పుడు మళ్లీ దొంగలు పడ్డారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల పేరిట దోచుకున్నారు. ఇదో స్కాం. పాపాల పెద్దిరెడ్డిని మళ్లీ హెచ్చరిస్తున్నా. అన్నీ దోచుకుంటున్నారు. కాంట్రాక్టులు, ఎమ్మెల్యేలు, స్మగ్లర్లు, దొంగలు అంతా వీరే. పెద్దిరెడ్డి డైరీకే పాలు పోయాలి. రెండు నెలల్లో తిన్నది కక్కిస్తా” అని చంద్రబాబు అన్నారు.

Also Read : ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీతో పొత్తులపై మంతనాలు..!

”స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ మరణించడం బాధాకరం. స్మగ్లర్లకు టికెట్ ఇచ్చే వైసీపీ పాలనలో పోలీసులకు భద్రత లేదు. గూండాలకు, స్మగ్లర్లకు జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్క చేస్తారా? టాస్క్ ఫోర్స్ ను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేసింది. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

”జే బ్రాండ్ మద్యం వల్ల 30లక్షల మంది ఆరోగ్యం దెబ్బతింది. మీకు నాణ్యమైన మద్యం అందిస్తాను. మేము వేసిన సిమెంట్ రోడ్లపై వైసీపీ నేతలు తిరుగుతున్నారు. దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసింది జగన్ మార్క్. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే టీడీపీ మార్క్. మద్యం పేరిట జగన్ చేసిన అప్పులు తీరాలంటే మందుబాబులు ఇంకో 20, 30 ఏళ్లు మద్యం తాగాలి. నువ్వు అర్జునుడివి కాదు. అక్రమార్జునుడు, భస్మాసురుడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నారు.

”ఎర్ర చందనం స్మగ్లర్లను, అవినీతిపరులను హెచ్చరిస్తున్నా. ఇక రెండు నెలలే మీ ఆటలు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలని నా కోరిక. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం జగన్. రాతి యుగానికి పోకుండా కాపాడుకోవాలి. యువత, మహిళలు తోడుంటే గెలుపు మనదే. జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు. అవినీతి డబ్బుతో సిద్ధం పోస్టర్లు పెడుతున్నారు. ఆ కటౌట్లు చూసిన ప్రతిసారీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు గుర్తుకురావాలి.

పెరిగిన ధరలు, పారిపోయిన కంపెనీలు గుర్తుకు రావాలి. దేనికి సిద్ధం వైసిపి చెప్పాలి. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలి. జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు పోవాలి. వాలంటీర్ల ఉద్యోగం తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే ఖబర్ధార్. జగన్ మార్క్ ఏంటో చెప్పండి. కోతలు లేని కరెంట్ ఇస్తాను. అంగళ్లు ఘటనలో మా వాళ్ళు 600 మందిపై కేసులు పెట్టారు. మేము తలుచుకుంటే 6వేల మందిపై కేసులు పెట్టగలను” అని చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ప్రకటించిన ముద్రగడ

”సీఎం జగన్ ఏపీకి పట్టిన శని గ్రహం. జగన్ ను ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది. జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకి పోతారు. వైసీపీకి సేవలు చేస్తే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. 5కోట్ల మంది ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా. పేదరికం లేని రాష్ట్రంగా చేయడమే నా లక్ష్యం” అని చంద్రబాబు అన్నారు.

”గొడ్డలి వేటు, కోడికత్తి కేసులు ఏమయ్యాయి? బాబాయ్ ను చంపిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతున్నాడు. చివరికి వివేకా కుమార్తెపైనే కేసులు పెడుతున్నారు. ఆస్తుల కోసం చెల్లితో గొడవపడి రోడ్డున పడ్డారు. అంతఃపుర రహస్యాలు బయటకు వస్తున్నాయి. సోనియా కాళ్ళు పట్టుకొని నాడు బెయిల్ తెచ్చుకున్నాడు. వీళ్ళ కుటుంబవ్యవహారాన్ని రాష్ట్ర సమస్యలా చిత్రీకరిస్తున్నారు. ఇది కుటుంబ వ్యవహారం. కానీ నాపై నిందలు మోపారు” అని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు.