బీఆర్ఎస్‌కు మరో షాక్..? కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి?

చేవెళ్ల పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సునీతా మహేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్‌కు మరో షాక్..? కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి?

MLC Patnam Mahender Reddy Meets CM Revanth Reddy

MLC Patnam Mahender Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ ను కలిశారు. వీరిద్దరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సునీతా మహేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్ గానే వీరి భేటీ జరిగినట్లుగా భావించొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో పట్నం మహేందర్ రెడ్డి మంతనాలు పూర్తయ్యాయి. మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి.. సీఎం రేవంత్ తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరి భేటీ ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయ్యింది.

ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ ను కలవడం చర్చకు దారితీసింది. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరడమే మిగిలిందనే ప్రచారం జరుగుతోంది. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఎప్పుడు, ఎక్కడ కాంగ్రెస్ లో చేరతారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. ”మా అన్న, వదినలు పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డిలు సీఎం రేవంత్ ని కలిసిన విషయం మీడియాలో చూశాను. వెళ్లే ముందు నాకు సమాచారం ఇవ్వలేదు. రాజకీయాల్లో ఎవరి ఇష్టాలు వారివి. వారికి చేవెళ్ల లోక్ సభ టికెట్ హామీ ఇచ్చినట్టు విన్నాను. అందుకే వాళ్లు సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని అనుకుంటా. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతా. మా అన్నయ్య కొడుకు జడ్పీటీసీ అవినాశ్ రెడ్డి కూడా చేరతారా లేదా అనే సమాచారం నాకు లేదు. కాంగ్రెస్ పార్టీ లో చేరదామని ఎన్నికలకు ముందు నాతో మా అన్న చర్చించారు. నేను అప్పుడే తిరస్కరించాను” అని పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.