Bihar Political Crisis : రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు.. పలువురు ఎమ్మెల్యేల ఫోన్‌లు స్విచ్ ఆఫ్.. నితీశ్ బలపరీక్షలో గట్టెక్కుతాడా?

బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది.

Bihar Political Crisis : రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు.. పలువురు ఎమ్మెల్యేల ఫోన్‌లు స్విచ్ ఆఫ్.. నితీశ్ బలపరీక్షలో గట్టెక్కుతాడా?

CM Nitish Kumar

Bihar Politics : బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమలో క్యాంప్ ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు పాట్నాకు చేరుకోగా.. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నాకు చేరారు. అయితే, జేడీయూ ఏర్పాటు చేసిన విందుకు 10మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటంతో బలపరీక్ష పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష కు ముందు జేడీయూ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. ఝార్ఖండ్ నుంచి అసెంబ్లీకి వెళ్తున్న సంజీవ్ కుమార్ ను నవడా ఫారెస్ట్ పోలీసులు రెస్ట్ హౌస్ లో నిర్బంధించారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే మిశ్రీ లాల్ యాదవ్ అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.

Also Read : Bihar Politics : జేడీయూతో దోస్తీ వద్దన్న బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడినట్టు..? కమలం వ్యూహాం ఇదేనా?

బీహార్ అసెంబ్లీలో నితీశ్ సర్కార్ బలపరీక్ష నేపథ్యంలో పాలక , విపక్ష పార్టీల నేతలు క్యాంపులకు తెరలేపిన విషయం తెలిసిందే. బీహార్ బీజేపీ ఎమ్మెల్యేలు మోదుగై నుంచి పాట్నాకు చేరుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన 19మంది ఎమ్మెల్యేలు ఈనెల 4 నుంచి హైదరాబాద్ మకాం వేశారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో వీరంతా తిరిగి పాట్నాకు బయలుదేరారు. మరోవైపు లాలూ నేతృత్వంలోని 79 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు తేజశ్వి యాదవ్ నివాసంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి ఎవరూ బయటకు వెళ్లకుండా తేజశ్వి యాదవ్ చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేలంతా ఇవాళ తేజశ్వి నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. బలపరీక్షకు సిద్ధమైన నితీశ్ కు కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు పదిమంది డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరు కావాలని మంత్రి శ్రవణ్ విప్ జారీ చేశారు.

Also Read : Bihar Politics : బీహార్‌లో ఎవరి బలమెంత? ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉందా?

బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్ల సంఖ్యా బలం ఉండాలి. బీజేపీ 78, జేడీయూ 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హెచ్ఏఎం కు చెందిన నలుగురు,  ఒక స్వతంత్ర ఎమ్మెల్యే జేడీయూకు మద్దతు పలుకుతున్నారు. మొత్తంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 128 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 19, వామపక్షాలకు 14, ఒక స్వతంత్ర్య అభ్యర్థి కలిసి మహా కూటమికి 113 సంఖ్యా బలం ఉంది. అయితే, ఆర్జేడీ అధికారంలోకి రావాలంటే మరో 8మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవేళ జేడీయూకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరు కాకుండా ఆర్జేడీకి మద్దతు పలికితే నితీశ్ రాజకీయ భవితవ్యం మొత్తం తలకిందులు అయ్యే అవకాశమూ లేకపోలేదు. జేడీయూలోని 10 మంది ఎమ్మెల్యేల హాజరుపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతుండగా.. బల పరీక్ష సమయంలో అద్భుతం జరగొచ్చంటూ తేజశ్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.