Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగుకు మొగ్గుచూపుతున్న రైతులు

Sunflower Cultivation : కాలానుగుణంగా అధిక దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో లేకపోవడం.. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో సరైన ధర పలకపోవడంతో...  మిర్చి, పత్తి లాంటి కమర్షియల్ పంటల సాగుకు మొగ్గు చూపారు రైతులు.

Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగుకు మొగ్గుచూపుతున్న రైతులు

Sunflower Cultivation

Sunflower Cultivation : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తే.. అన్నదాతలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఇది తెలుసుకున్న రైతులు వాటిసాగు చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటు వ్యవసాయశాఖ అధికారులు కూడా అలాంటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంటలను సాగుచేయిస్తున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని రైతుల చేత ఈ ఏడాది  పొద్దుతిరుగుడు పంటను సాగు చేయించారు. పంట ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Crop Cultivation Techniques : 7 ఎకరాల్లో ఏడంచెల సాగు.. ఏడాది పొడవునా పంటల దిగుబడి

నూనె గింజల సాగులో వేరుశెనగ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో పొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి. ఒకప్పుడు ఈ పంటను అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేసేవారు. అయితే కాలానుగుణంగా అధిక దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో లేకపోవడం.. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో సరైన ధర పలకపోవడంతో…  మిర్చి, పత్తి లాంటి కమర్షియల్ పంటల సాగుకు మొగ్గు చూపారు రైతులు.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటున్న రైతులు : 
అయితే ప్రస్తుతం పొద్దుతిరుగుడులో అధిక దిగుబడులిచ్చే నూతన హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి రావడం.. ఇటు మార్కెట్ లో అధిక ధర పలుకుతుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, కలువాయి మండలం, తోపుగుంట గ్రామంలో 170 నుండి 200 ఎకరాల వరకు పొద్దుతిరుగుడు పంటను సాగుచేశారు రైతులు. ప్రస్తుతం గింజకట్టే దశలో ఉన్న ఈ పంట తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు వస్తాయంటున్నారు.

పొద్దు తిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలపరిమితి ఉండడంతో చాలామంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయశాఖ అధికారులు పంట మార్పిడిలో బాగంగా పొద్దతిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో పొద్దుతిరుగుడు సాగు చేపట్టవచ్చు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది. పంట వ్యవధి మూడు నెలలకాగా, ఎకరాకు 12 నుండి 15 వేల రూపాయల పెట్టుబడి పెడితే 40 వేల నుండి 45వేల వరకు అదాయం పొందవచ్చు.

కొద్ది పాటి యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి రైతులకు పొద్దుతిరుగుడు పంట మంచి అదాయం సమకూరుస్తుంది. అయితే ఈ పంటసాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సకాలంలో గమనించి  నివారిస్తే.. మంచి దిగుబడిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారులు .

Read Also : Sesame Cultivation : నువ్వుల సాగుపై జగిత్యాల పరిశోధనా స్థానాల అధ్వర్యంలో కిసాన్ మేళా