సీఎం జగన్‌ వ్యూహం ఏంటి.. ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది?

మొత్తానికి చాపకింద నీరులా తన ప్రణాళిక అమలు చేస్తున్న సీఎం జగన్‌.. వచ్చే ఎన్నికల్లో విక్టరీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్‌ స్కెచ్‌ వర్క్‌అవుట్‌ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

సీఎం జగన్‌ వ్యూహం ఏంటి.. ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది?

CM Jagan Vyuham

CM Jagan Vyuham : వ్యూహం.. ఇది సినిమా వ్యూహం కాదు.. సీఎం జగన్‌ పొలిటికల్‌ వ్యూహం.. వచ్చే 30ఏళ్లు నేనే సీఎం అంటూ గతంలో ప్రకటించుకున్న జగన్‌.. వచ్చే ఎన్నికలకు అంతే పకడ్బందీగా రెడీ అవుతున్నారా? ఒకవైపు ఎడాపెడా మార్పులు.. మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఇంకోవైపు సోషల్‌ ఇంజనీరింగ్‌.. ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో కొత్త పంథా.. అసలు ఏంటి? సీఎం జగన్‌ వ్యూహం.. వచ్చే ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది?

ఓటు బ్యాంకు పదిలం చేసుకునే ప్లాన్‌
ఏపీ ఎన్నికలకు సీఎం జగన్‌ అదిరిపోయే స్కెచ్‌ వేస్తున్నారు. అసెంబ్లీ ఇన్‌చార్జులను ఎడాపెడా మార్చేస్తూ.. సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంటున్నారనే సందేహాలు పటాపంచలవుతున్నాయి. అభ్యర్థుల మార్పు వెనుక పకడ్బందీ వ్యూహం.. సామాజిక సమీకరణాలతో చేస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌తో బలమైన ఓటు బ్యాంకును పోగు చేసుకుంటున్నారు సీఎం జగన్‌. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీకి.. అదే బీసీలను దూరం చేసే ప్రణాళికతో ఎన్నికలకు భారీ ప్లానింగే చేశారు సీఎం జగన్‌. ఇప్పటివరకు 70 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన సీఎం.. ఎక్కువగా బీసీలు.. బీసీల్లోనూ బాగా వెనుకబడిన వర్గాలు.. బలమైన ఓటు బ్యాంకు కలిగిన కులాలను ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, జిల్లాల్లో శెట్టిబలిజ, యాదవ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్లాన్‌ చేస్తున్నారు సీఎం జగన్‌.

రాజకీయాల్లో వ్యూహమే ముఖ్యం.. పకడ్బందీ వ్యూహ రచనతోనే విజయం దక్కుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం. సీఎం జగన్‌ కూడా ఈ వ్యూహ రచనలోనే తన మార్కు చూపిస్తున్నారు. ఎన్నికలకు వంద రోజుల ముందే క్యాడర్‌ను సిద్ధం చేయాలని సంకల్పించారు. అందుకు తగ్గట్టే డిసెంబర్‌ నుంచే నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను మార్చడం మొదలు పెట్టారు. ఒకేసారి మార్పులు చేయకుండా వారం పది రోజుల గ్యాప్‌లో పది-పదిహేను స్థానాలకు సమన్వయకర్తలను మార్చడం ద్వారా.. ఎక్కడైనా అసంతృప్తులు, అసమ్మతులు ఉంటే అదుపు చేయొచ్చని భావించారు.

ఏడు విడతల్లో జాబితా.. జగన్‌ మార్కు వ్యూహం
సీఎం జగన్‌ ఊహించినట్టుగానే ఏడు విడతల్లో జాబితా విడుదల చేయగా, కొద్దిమంది అసంతృప్తి గళమెత్తారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ పార్టీ లైన్‌ దాటలేదు. అలా పార్టీని వదిలి వెళ్లిన వారు కూడా మళ్లీ యూటర్న్‌ తీసుకుని పార్టీలోకి వస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇందుకు చక్కని ఉదాహరణ. డిసెంబర్‌లో మొదటి జాబితా విడుదల చేయడానికి ఒక్కరోజు ముందు వైసీపీని వీడిన ఆర్కే.. రెండు నెలలు తిరిగేసరికి సొంతగూటికి చేరుకోవడం జగన్‌ మార్కు వ్యూహం. రాజకీయాల్లో 30-40 ఏళ్ల అనుభవం ఉన్నవారు కూడా జగన్‌ ఎత్తుగడలను పసిగట్టలేనకపోతున్నారంటే అతిశయొక్తి కాదు.

175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసి..
ఒక్క ఆర్కే మాత్రమే కాదు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి కుటుంబానికి చెందిన రాయపాటి రంగారావు వంటి వారిని పార్టీలోకి తీసుకోవడం సీఎం రాజకీయ చతురతకు నిదర్శనమంటున్నారు. రాజధాని ఉద్యమంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్‌ జరిగిందనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి.. ఆ ప్రాంతానికి చెందిన బలమైన నేతలను వైసీపీలోకి ఆకర్షించడం చాలా ప్రధానమైనది అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వంద రోజుల ముందు నుంచి పార్టీ ప్రక్షాళన చేయడం ద్వారా ఎన్నికల ముందు ఉండే ఒత్తిడిని అధిగమించారు సీఎం. షెడ్యూల్‌ విడుదలయ్యేసరికి మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసి.. క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఉధృతం చేసే దిశగా కదులుతుంది వైసీపీ.

ప్రతిపక్షాల ఆలోచనపై జగన్‌ దెబ్బ
జగన్‌ ఆలోచనలను ముందు పసిగట్టని ప్రతిపక్షాలకు ఆలస్యంగా తత్వం బోధపడింది. అభ్యర్థుల మార్పు ద్వారా వైసీపీ నుంచి 40-50 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేశారు. ఇలా ఎమ్మెల్యేలు వస్తే రాజ్యసభ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా.. వైసీపీ అసంతృప్తులతో ఓ స్థానం గెలవొచ్చని ప్రణాళిక వేశారు. కానీ, జగన్‌ ప్రతిపక్షాల ఆలోచనపై ఆదిలోనే దెబ్బకొట్టారు. మార్పుల్లో సీట్లు దక్కని ఏ ఒక్కరూ పార్టీ లైన్‌ దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ఒకరిద్దరు వెళ్లినా వారితో ఎలాంటి ప్రభావం చూపలేమని భావించిన ప్రతిపక్షాలు రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించాయి.

Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?

ఇదంతా పరిశీలిస్తే సీఎం జగన్‌ వ్యూహంతోనే మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకోగలిగింది వైసీపీ. ఇంకా చెప్పాలంటే రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడమే కాదు, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ప్రస్తుతం గెలిచిన ముగ్గురితో కలిసి వైసీపీ బలం 11కి పెరుగుతుంది. ఈ బలంతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తనకు కావాల్సిన పనులు చేయించుకోగలుగుతుంది వైసీపీ. ఇదంతా జగన్‌ ముందుచూపుతో ప్రణాళిక బద్ధంగా వేసిన అడుగులతోనే సాధ్యమైందంటున్నారు పరిశీలకులు.

Also Read: వైసీపీలో జోష్ పెంచిన రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవకాశం!

మొత్తానికి చాపకింద నీరులా తన ప్రణాళిక అమలు చేస్తున్న సీఎం జగన్‌.. వచ్చే ఎన్నికల్లో విక్టరీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్‌ స్కెచ్‌ వర్క్‌అవుట్‌ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.