వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం జమ చేసిన సీఎం జగన్

అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని, తమది రైతుపక్షపాత ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం జమ చేసిన సీఎం జగన్

CM Jagan Releases YSR Rythu Bharosa Funds

YSR Rythu Bharosa: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును ఆయన జమ చేశారు. పంట రుణాల తీసుకుని క్రమం తప్పకుండా చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా ఆయన జమచేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని, తమది రైతుపక్షపాత ప్రభుత్వమని చెప్పారు. రైతు అందాల్సిన సమయంలో సహయం అందిస్తున్నామని చెప్పారు. రైతులు, రైతు కూలీలు బాగుండాలని అడుగులు వేశామని తెలిపారు. రైతన్న ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మించి రైతులకు సహాయం చేశామన్నారు. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో రైతులకు మంచి చేశామని, పగటిపూటే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. అన్నదాతల కోసం గ్రామస్థాయిలో RBKలు పనిచేస్తున్నాయని, వ్యవసాయ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని చెప్పారు.

విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ రూపాయిన్నరకే ఇస్తూ ఆదుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన సున్నా వడ్డీని కూడా తాము ఇస్తున్నామని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ కు ఏటా 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతన్న ఏ రకమైన కష్టం వచ్చినా.. ప్రభుత్వం తన కష్టంగా భావించి ఆదుకుంటోందన్నారు.

Also Read: అభ్యర్థులు మీరే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

అన్నదాతలను మోసం చేసిన చంద్రబాబు
రైతులను చంద్రబాబు మోసం చేశారని.. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారని ఆరోపించారు. రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన సున్నా వడ్డీని కూడా తామే చెల్లించామన్నారు. ఐదేళ్లలో తాము రైతు భరోసా కింద రూ.34,228 కోట్లు రైతులకు సాయం అందించామన్నారు. వివిధ పథకాల ద్వారా రైతన్నల సంక్షేమం కోసం ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం జగన్ వివరించారు. గతానికి, ఇప్పటికి తేడా గమనించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని ఆయన ఆకాంక్షించారు.