Devineni Uma Maheswara Rao : టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?

తనకు మైలవరం ఇవ్వకపోయినా, పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం... మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్‌ తిన్నారు.

Devineni Uma Maheswara Rao : టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?

Devineni Uma Maheswara Rao

Devineni Uma Maheswara Rao : టీడీపీతోనే కలిసి… నడిచి… పెరిగిన దేవినేని కుటుంబానికి తొలిసారి షాక్‌ తగిలింది. టీడీపీ చరిత్రలోనే తొలిసారి ఆ కుటుంబం పోటీకి దూరమైంది. పార్టీలో సీనియర్‌ నేతగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా పని చేసిన దేవినేని ఉమాకి ఈసారి ఎక్కడా పోటీ చేసే చాన్స్‌ లేదు. ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కని నేతలు ఎందరో ఉండగా, ఉమాకి సీటు లేదనే అంశమే విస్తృత చర్చకు దారితీస్తోంది. అసలు ఉమా సీటు ఎలా గల్లంతైంది? టీడీపీలో దేవినేని కుటుంబం స్పెషల్‌ ఏంటి?

దేవినేని అంటే… టీడీపీ… టీడీపీ అంటే దేవినేని..
దేవినేని… ఈ పేరే ఓ బ్రాండ్‌. కృష్ణ, గుంటూరు జిల్లా రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి ప్రత్యేక ముద్ర. దేవినేని అంటే… టీడీపీ… టీడీపీ అంటే దేవినేని కుటుంబమే ఆ రెండు జిల్లాల్లో గుర్తుకు వస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలే కాదు టీడీపీ రాజకీయాల్లో దేవినేని కుటుంబం ముద్ర ప్రత్యేకం. పార్టీ వ్యవస్థాపకుల్లో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకరు.

1983 నుంచి 1994 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని కంకిపాడులో నెహ్రూనే టీడీపీ గెలుపు జెండా ఎగురవేశారు.. 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత దేవినేని నెహ్రూకు పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్య గ్యాప్‌ వచ్చి.. నెహ్రూ పార్టీని వీడినా.. దేవినేని కుటుంబానికే చెందిన మరో నేత దేవినేని వెంకటరమణ టీడీపీలోనే కొనసాగారు. ఇక దేవినేని నెహ్రూ చివరి మజిలీ కూడా టీడీపీలోనే ముగిసింది.

అనూహ్యంగా సీటే గల్లంతు..!
1983లో టీడీపీని స్థాపించగా, కోస్తాంధ్రలో టీడీపీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు నెహ్రూ. ఆ తర్వాత ఆయనకు వరసకు సోదరులయ్యే దేవినేని వెంకటరమణ, ఉమా కూడా టీడీపీ తరఫున చక్రం తిప్పారు. ఈ ముగ్గురు సోదరులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లోనూ దేవినేని కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చింది టీడీపీ. నెహ్రూ కుమారుడు అవినాశ్‌కి గుడివాడ ఎమ్మెల్యే బరిలో దింపగా, ఎన్నికల తర్వాత ఆయన పార్టీని వీడారు.

ఇక ప్రస్తుతం టీడీపీలో సీనియర్‌గా ఉన్న దేవినేని ఉమా కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో తొలిసారిగా ఓడినా, ప్రభుత్వంపై మడమతిప్పని పోరాటం చేశారు. ఉమ్మడి కృష్ణాలో పార్టీని నిలబెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఆయన సీటే గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో 41 ఏళ్లలో తొలిసారిగా దేవినేని కుటుంబం పేరు లేని టీడీపీ జాబితా విడుదలైనట్లైంది.

ఆయన రాకతో దేవినేని ఉమా సీటుకు ఎర్త్..
1999లో తొలిసారిగా పోటీ చేసిన ఉమా…. నందిగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా 2004లో నందిగామ నుంచే గెలిచిన ఉమా, 2009లో నియోజకర్గాల పునర్విభజనతో మైలవరం నియోజకవర్గానికి మారారు. 2009, 2014 ఎన్నికల్లో వరసగా గెలిచి… 2014లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన మైలవరం నుంచి పోటీ చేస్తారని భావించారు. ఐదేళ్లుగా అదే నియోజకవర్గంలో పనిచేశారు.

కానీ, కొద్ది రోజుల క్రితం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌… టీడీపీలో చేరడంతో ఉమా సీటుకు ఎర్త్‌ పడింది. కృష్ణప్రసాద్‌ రాకతో ఉమాను పక్కనే ఉన్న పెనమలూరుకు మార్చాలని చూసినా… అక్కడ మాజీ ఎమ్మెల్యే బొడే ప్రసాద్‌ టికెట్‌ కోసం పట్టుబడటంతో ఉమా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

దేవినేని కుటుంబం ప్రభావం ఉండే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఉమాకు ఎక్కడా సర్దుబాటు పరిస్థితి కనిపించడం లేదు. నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా దేవినేని కుటుంబం టీడీపీ తరఫున పోటీ చేయకుండా తప్పుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు మైలవరం ఇవ్వకపోయినా, పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం… మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్‌ తిన్నారు. ఇప్పుడు ఉమా స్పందన ఏంటన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.

Also Read : వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ప్రణాళిక ఏంటి? ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత?