AP BJP : ఏపీ బీజేపీలో సీట్ల లొల్లి.. ఢిల్లీ బాటపట్టిన సీనియర్లు

బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ బాటపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

AP BJP : ఏపీ బీజేపీలో సీట్ల లొల్లి.. ఢిల్లీ బాటపట్టిన సీనియర్లు

AP BJP Leaders

AP BJP Leaders : ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. ఆరు లోక్ సభ స్థానాలకు ఆదివారం రాత్రి అభ్యర్థుల జాబితాను కేంద్ర బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. కొత్తపల్లి గీత (అరకు), సీఎం రమేశ్ (అనకాపల్లి), డి. పురందేశ్వరి (రాజమహేంద్రవరం), భూపతిరాజు శ్రీనివాసవర్మ ( నరసాపురం), వరప్రసాద రావు (తిరుపతి), ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి (రాజంపేట)లకు టికెట్లు కేటాయించింది. టికెట్ల కేటాయింపుపై బీజేపీలోని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొందరు బీజేపీ నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

Also Read : AP Politics : టీడీపీ, జనసేనకు షాక్ ఇచ్చిన నాయకులు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కార్యకర్తలు

విశాఖ పట్టణం నుంచి జీవీఎల్ నర్సింహారావు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. రాజమండ్రి నుంచి సోము వీర్రాజు టికెట్ ఆశించారు. అయితే, రాజమండ్రి నియోకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకే దక్కినప్పటికీ ఆ స్థానాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కేటాయించారు. నర్సాపురం, రాజంపేట, తిరుపతి సీట్లలో టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ సీనియర్ నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే సీనియర్లకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలని అధిష్టానానికి బీజేపీ సీనియర్ నేతలు లేఖ రాశారు.

Also Read : Bjp Mp Candidates List : ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ పది నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. నేడోరేపో అసెంబ్లీ సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ బాటపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. జీవీఎల్, సోమువీర్రాజులను బీజేపీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.