Sunflower Cultivation Tips : ప్రొద్దుతిరుగుడు సాగులో సమగ్ర యాజమాన్యం

Sunflower Cultivation Tips : ఖరీఫ్‌లో తేలికపాటి నేలల్లో జూన్‌ 15 నుండి జూలై 15వరకు విత్తుకోవచ్చు. బరువైన నేలల్లో అగస్టు 15 వరకు విత్తుకోవచ్చును.  నీరు నిల్వ ఉండని ఎర్ర చెలక, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనువైనవి.

Sunflower Cultivation Tips : ప్రొద్దుతిరుగుడు సాగులో సమగ్ర యాజమాన్యం

Sunflower Cultivation Tips

Sunflower Cultivation Tips : నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనపంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప,  నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో అధిక విస్ధీర్ణంలో సాగవుతోంది. మిగిలిన నూనెగింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనెశాతం అధికంగా వుండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్ లో వేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులను పొందేదుకు ఆస్కారం ఉంటుంది. అయితే హైబ్రిడ్ రకాలు.. సాగు యాజమాన్యం ఏవిధం చేపట్టాలో ఇప్పడు తెలుసుకుంద్దాం..

తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఖరీఫ్‌లో వర్షాలు ఆలన్యమైనప్పుడు ఒక ప్రత్యామ్నాయ పంటగా, మరియు యాసంగి, వేసవి కాలాల్లో కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకొని తక్కువ కాలపరిమితి గల ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసి మంచి దిగుబడులు, నికరాదాయము పొందవచ్చును. అయితే ప్రొద్దుతిరుగుడు పంటను చిన్న, చిన్న కమతాలలో కాకుండా ప్రక్క ప్రక్క కమతాల రైతు సోదరులు ఒకేసారి 20 నుండి 25 ఎకరాలలో కలిసి సాగు చేస్తే పక్షుల బెడద తక్కువగా ఉండి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారముంటుంది. ఖరీఫ్‌లో తేలికపాటి నేలల్లో జూన్‌ 15 నుండి జూలై 15వరకు విత్తుకోవచ్చు. బరువైన నేలల్లో అగస్టు 15 వరకు విత్తుకోవచ్చును.  నీరు నిల్వ ఉండని ఎర్ర చెలక, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనువైనవి.

వర్షాధారంగా పండించేందుకు బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు కూడా అనుకూలమే. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిధ్యాలయాలు  విడుదల చేసిన హైబ్రీడ్ రకాలు అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలిస్తున్నాయి.  వీటిలో KBSH-44, NDSH-1, DRSH-1 వంటి సంకర వంగడాలు మనప్రాంతంలో సాగుకు అనువుగా ఉన్నాయి. కె.బి.ఎస్‌.హెచ్‌ -44 రకం పంటకాలం 90 నుండి 95 ఎకరాకు 560 నుండి 600 కిలోల దిగుబడి వస్తుంది. ఎన్‌.డి.ఎస్‌.హెచ్‌ -1 రకం  పంటకాలం 80 నుండి 85 రోజలు. ఎకరాకు 600 నుండి 700 కిలోల దిగుబడి వస్తుంది. డి.ఆర్‌.ఎస్‌.హెచ్‌ -1 రకం  పంటకాలం 90 నుండి 95 రోజులు . ఎకరాకు 600 నుండి 700 కిలోల దిగుబడి వస్తుంది. ఈహైబ్రిడ్‌ రకాలతో పాటు, ప్రైవేటు రంగ హైబ్రిడ్‌లను కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. రైతులు వాటిని కూడా సాగు చేసుకోవచ్చును.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ప్రొద్దుతిరుగుడు పంటను అంతర పంటగానే కాకుండా ఏకపంటాను సాగుచేసుకోవచ్చు. అంతర పంటలుగా సాగుచేసినప్పుడు వేరుశనగ 4 వరుసలు ప్రొద్దుతిరుగుడు 2 వరుసలు , కంది ఇక వరుస ప్రొద్దుతిరుగుడు 2 వరుసల్లో ఖరీఫ్‌లో సాగు చేయాలి. ఎకరాకు రెండున్నర  కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం థయోమిథాక్సామ్‌ 3గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే  నెక్రోనిన్‌ వైరన్‌ తెగులు సమస్యను అరికట్టవచ్చు.  అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్‌ + కార్చండిజమ్‌ 2గ్రాముల కిలో విత్తనానికి వాడి విత్తనశుద్ధి చేసుకోవాలి.

బోదెలు చేసి విత్తనం నాటినట్లయితే పంటకాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయటానికే కాకుండా మొక్కలకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది. విత్తేటప్పుడు తేలిక నేలల్లో అయితే సాళ్ల మధ్య 45 సెం. మీ. మొక్కల మధ్య దూరం 20 నుండి 25 సెం.మీ. అదే నల్లరేగడి భూముల్లో అయితే సాళ్ల మధ్య దూరం 60 సెం.మీ. , మొక్కల మధ్య దూరం 30 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల తర్వాత కుదురుకు అరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు,  పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.

పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకం. విత్తే ముందే ఎకరాకు 2 నుండి3 టన్నుల పశువుల ఎరువును వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు అందించాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను అందించాలి. నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు, మిగతా సగం 2 దఫాలుగా వేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు జిప్సం 55 కిలోలు వేస్తే, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. పైరు పూతదశలో ఉన్నప్పుడు 2గ్రాముల బోరాక్స్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ప్రొద్దుతిరుగుడు పంటలో మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ, గింజకట్టే సమయం కీలక దశలు. నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్ర నేలల్లో 8 నుండి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలలకు అయితే 15 నుండి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. పంటలో కలుపు నివారణ చాలా ముఖ్యం. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని పెండిమిథాలిన్‌ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని  నేలపై పిచికారి చేయాలి. పంట విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత గుంటక లేదా దంతితో అంతరకృషి  చేయాల్సి ఉంటుంది.

Sunflower Cultivation Tips : ప్రొద్దుతిరుగుడు సాగులో సమగ్ర యాజమాన్యం

పొద్దుతిరుగుడు పంటకు పలు రకాల చీడపీడలు ఆశిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పచ్చదీపపు పురుగులు. ఇవి వాతావరణంలో ఉష్ణోగ్రతలు 30 సెంటీ గ్రేడ్ కంటే ఎక్కువైనప్పుడు , పైరు బెట్టకు గురైనప్పుడు ఆశిస్తుంటాయి. ఇవి ఆశిస్తే ఆకుల చివర్లు పసుపు వచ్చగా మారి, పూర్తిగా ముడుచుకొని దోనెల లాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోపాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఇది ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన, మొక్కలు గిడసబారి పోతాయి. నివారణకు టటైజోఫాస్‌ 2.5 మి.లీ. లేదా ధయోమిథాక్సామ్‌ 0.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు తామర పురుగుల ఉదృతి ఎక్కువవుతుంది. పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఇవి నెక్రోసిస్ వైరస్ తెగులును పరోక్షంగా వ్యాప్తి చేసి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు ధయోమిథాక్సావు 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ది చేయాలి.  ఇమిడాక్లోప్రిడ్‌ 4 మి.లీ. 10లీ. నీటికి లేదా ధయోమిథాక్సామ్‌ 0.5 గ్రా.  లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.  పైరు 30 రోజుల దశనుంచి పొగాకు లద్దెపురుగు ఆశిస్తుంది. గుంపులుగా ఆకులపై చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. దీని వలన అకులు జల్లెడ ఆకులుగా మారుతాయి.

దీని నివారణకు నోవాల్యురాన్‌ 1.0 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.  లేదా సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించు కోవాలి. పుష్పించే దశలో ఎక్కువగా ఆశించే పురుగు బీహరి గొంగళి పురుగు. ఈ పురుగులు ఎకక్కువగా ఆశిస్తే మొక్కలు మోడు బారిపోతాయి. వీటి నివారణకు క్లోరిపైరిఫాన్‌ 2 మి.లీ. + డైక్లోరోవాస్‌ 1 మి.లీ. మందును  లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పుష్పించే దశలో శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. లార్వాలు.. పువ్వులు, గింజల మధ్యన చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు ధయోడికార్బ్ 1గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పైరు 25 రోజుల నుంచి 65 నుండి 70 రోజుల వరకు  అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించి తీవ్రనష్టం కలుగజేస్తుంది. ఇవి ఆశించినప్పుడు ముదురు గోదుమరంగు మచ్చలు ఏర్పడి, ఆకులు మాడిపోయినట్లు అవుతాయి. వీటి నివారణకు ప్రోపికొనజోల్‌ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఒక కిలో విత్తనానికి 2 గ్రాముల ఇప్రోడియాన్‌ +కార్బండిజమ్‌ తో విత్తనశుద్ధి చేయాలి. తేమ తక్కువగా వుండే వేడి  వాతావరణంలో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అకులపై, అడుగుభాగాన బూడిద లాంటి పొడి కప్పబడి ఉంటుంది. దీని నివారణకు డినోక్యావ్‌ 1.మి.లీ లేదా ప్రొపికొనజోల్‌ 1.మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగుల ద్వారా నెక్రోసిస్‌ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశిస్తే అకులు సరిగా పెరగక గిడస బారి పోతాయి. పువ్వు సరిగ్గా విచ్చుకోక మెలిక తిరిగి వంకరగా మారుతాయి. ఈ తెగులు నివారణకు విత్తనశుద్ధి చేయాలి. పార్టీనియం కలువును నివారించాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్‌ 4.0 మి.లీ. మందును 10 లీ. నీటికి, ధయోమిథాక్సామ్‌ 0.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేయాలి. నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకొని సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే  వర్షాధారం క్రింద సాగుచేస్తే ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్లు , నీటి పారుదల క్రింద సాగుచేస్తే 8 నుండి 10 క్వింటాళ్ళ దిగుబడి సాధించ వచ్చును.

Read Also : Sorghum Cultivation Process : కంది పంట సాగులో పాటించాల్సిన మెళకువలు.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు