ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని భయపెడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి?

డబ్బులు పోయినా రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారట కౌశిక్ రెడ్డి. ఏదిఏమైనా కౌశిక్‌రెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్ లీడర్ కూడా..

ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని భయపెడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి?

Gossip Garage : ఆయనో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే… బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఆ నేత ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. కారు పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్నా.. ఆయన మాత్రం కాంగ్రెస్‌తో సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా రాజకీయంగా గట్టి పునాదులే వేసుకునేలా పక్కాగా అడుగులు వేస్తున్నారు. జిల్లా మంత్రితో ఓ వైపు యుద్ధం చేస్తూనే… బ్లాక్ బుక్ అంటూ అధికారులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాజకీయంగా దూకుడుగా ఉన్న ఆ నేతను ఓ సెంటిమెంట్ భయపెడుతోందట. దాంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకే జంకుతున్నాడట. ఇంతకీ ఏంటా సెంటిమెంట్ … ఎవరా ఎమ్మెల్యే?

ఈటల రాజేందర్ అందుకే ఓడిపోయారట..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలు సెట్ చేస్తున్నారు అధికారులు. క్యాంపు కార్యాలయానికి సరైన వాస్తు లేదనే కారణంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదట. బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటమికి కార్యాలయంలో వాస్తుదోషాలే కారణమని కౌశిక్ రెడ్డి విశ్వసిస్తున్నారట. తనకు నమ్మకస్తులైన వాస్తు పండితులను క్యాంపు ఆఫీసుకు తీసుకురాగా, వారి సూచనలతో భవనంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత నిర్మాణాలను తొలగిస్తూ.. వాస్తును సెట్ చేస్తున్నారు.

దాని వల్లే పార్టీ నుంచి బహిష్కరణ, ఎన్నికల్లో ఓటమి..!
హుజురాబాద్ కేసీ కెనాల్ క్యాంప్ ఏరియాలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఈ క్యాంపు కార్యాలయం నుంచే ఈటల పాలన సాగించారు. అయితే బీఆర్ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన ఈటల.. క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టిన తరువాతే రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికంగా ప్రచారం జరగుతోంది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురికావడం, వరుసగా ఏడు సార్లు గెలిచి గత ఎన్నికల్లో ఓటమి పాలవ్వడానికి కారణం క్యాంపు కార్యాలయం వాస్తు ఎఫెక్టే అంటున్నారు కొందరు నేతలు. ఈటల సైతం వాస్తు సరిగా లేదని కాంపౌండ్ వాల్‌ను కూల్చేసి వేరే చోట నిర్మించారు. అయినా కార్యాలయానికి ఉన్న వాస్తుదోషాలు పూర్తిగా పోలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుమానిస్తున్నారట… వాస్తు పండితులు కూడా ఇదే విషయం చెబుతుండటంతో మళ్లీ మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు.

వాస్తుదోషాల పేరిట మళ్లీ లక్షల రూపాయలు ఖర్చు..
వాస్తుదోషాలను సవరించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గుమ్మటాన్ని తొలగిస్తున్నారు. కిటికిలు, తలుపులను వాస్తు ప్రకారం మారుస్తున్నారు. ఎమ్మెల్యే బస చేయడానికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలకు కొదవ లేకుండా మరమ్మత్తులు మొదలు పెట్టారు. లక్షలు ఖర్చు చేసి ఇంజనీరింగ్ ప్లానింగ్‌తో నిర్మించిన క్యాంప్ ఆఫీస్‌కు… వాస్తుదోషాల పేరిట మళ్లీ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డబ్బులు పోయినా రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారట కౌశిక్ రెడ్డి. ఏదిఏమైనా కౌశిక్‌రెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్ లీడర్ కూడా వాస్తుపై నమ్మకం పెట్టుకోవడం, వాస్తు సరిగా లేదని భయపడుతుండటం హుజూరాబాద్ లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : బీజేపీలో చేరేందుకు భయపడిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..! ఎందుకో తెలుసా..