తొందరెందుకు.. కొంచెం ఓపిక పట్టు, నీకు నీళ్లు తాగిపిస్తా- బాలినేనికి ఎమ్మెల్యే దామచర్ల కౌంటర్

అధికారంలో ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ తో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించింది నీవు కాదా? ఎన్నికల ప్రచారంలో మహిళపై దాడి చేయించింది నీ కోడలు కాదా?

తొందరెందుకు.. కొంచెం ఓపిక పట్టు, నీకు నీళ్లు తాగిపిస్తా- బాలినేనికి ఎమ్మెల్యే దామచర్ల కౌంటర్

Janardhana Rao Damacharla : వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తనను ఉద్దేశించి బాలినేని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే దామచర్ల. ఎన్నికలు ముగిసిన అనంతరం పారిపోయి.. ఇప్పుడు బాలినేని ఒంగోలు వచ్చారని ఆయన అన్నారు. బాలినేని.. జనసేన లేదా టీడీపీలో చేరాలని భావించారని, కుదరకపోవడంతో మళ్లీ ఒంగోలుకు వచ్చారని విమర్శించారు. నేను గెలిచి కరెక్ట్ గా నెల రోజులు కాలేదు అప్పుడే బాలినేని మాటలు ఏంటి? అని మండిపడ్డారు.

”ఒంగోలు చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో ఈసారి టీడీపీని గెలిపించారు. ఒంగోలులో బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అక్రమాలు, అరాచకాలు చేయబట్టే ప్రజలు ఆగ్రహంతో తీర్పు ఇచ్చారు. ఒంగోలులో అక్రమంగా నిర్మించిన నివాసాలు, అపార్ట్ మెంట్లు ఉన్నాయి. అందులో నిర్మించిన వాటిలో టీడీపీ వాళ్లు ఉన్నారు, వైసీపీ వాళ్లూ ఉన్నారు. వాటిలో కూడా డబ్బులు వసూలు చేశానని దుర్మార్గపు మాటలు బాలినేని చెబుతున్నారు. వయసులో పెద్దవాడు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ తో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించింది నీవు కాదా? ఎన్నికల ప్రచారంలో మహిళపై దాడి చేయించింది నీ కోడలు కాదా?

అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడేం చేస్తావో చూస్తా. ఒరేయ్, వీడు, వాడు అంటూ ఏకవచనం చేసి మాట్లాడితే ఎక్కిన కొవ్వు దించుతా. ఇంకోసారి ఒరేయ్ అను. నీ సంగతి చూస్తా. బాలినేని విల్లాలో పక్కా అవినీతి జరిగింది. ఐరన్ ఓర్ గ్రావెల్ ఫ్రీగా ఎలా తోలావు. చిల్లర చేష్టలు చేసి ఆ తప్పులను ఇతరులపై నెట్టేస్తావా? నీ కొడుకు డబ్బులు వసూలు చేసి మళ్లీ ఇతరులను బెదిరిస్తావా? గ్రానైట్, ఇసుక క్వారీల్లో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా? ఒక సాధారణమైన వ్యక్తివి అయిన నీకు.. ఈరోజు కోట్ల విలువ చేసే కార్లు, ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయి? మేము అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యింది. అప్పుడే ఎందుకు ఆవేశపడతావు? వెళ్లి ఆరోగ్యం చూపించుకో.

వైజాగ్ లో ఎక్కడ భూములు కొన్నావో, ఎక్కడ ఏమేం దాచి పెట్టావో.. ఒంగోలులో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. వాటన్నింటినీ బయటకు తీస్తాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వారిపై ఎవరైతే దాడి చేశారో వాటి వీడియోలు బయటకు తీసి సంబంధిత వ్యక్తులపై కేసులు పెడతాం. పోలీసులు, అధికారులు తమ పని చట్టబద్ధంగా చేసుకుపోతారు. మీరు చేసిన అక్రమాలు, అరాచకాల జోలికి రాకూడదంటే అధికారులు ఊరుకోరు. నీవు ఒంగోలులోనే ఉండు. పోటీ చేయి. ఎవరు వద్దన్నారు? నాకివే చివరి ఎన్నికలు అంటావు. మళ్లీ పోటీలో ఉంటానంటావు. ప్రశ్న నీవే ఆన్సర్ నీవే. నిందలు మాత్రం ఇతరులపై మోపుతావు. నేను ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాలేదు. అప్పుడే మంచి నీళ్లు ఇవ్వలేదంటూ ఆరోపిస్తావు. అధికారంలో లేనప్పుడు మంచి నీళ్లు ఇవ్వందే నేను రాజకీయాల్లో ఉండను అంటావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ నీళ్ల సమస్యనే పట్టించుకోవు. లేస్తే అబధ్ధాలు మాట్లాడతావు.

గతంలో ఒంగోలు సీటు ఇస్తే టీడీపీలోకి వస్తానని సీఎం చంద్రబాబుతో మంతనాలు సాగించింది నీవు కాదా? ఇదే విషయం మా నాయకుడు చంద్రబాబు మాతో చెప్పగా అంగీకరించేది లేదని చెప్పాం. ఓటమి చెందిన తర్వాత జనసేన కార్యకర్తలకు మెసేజ్ పెట్టింది నీవు కాదా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్ ఇప్పిస్తానని ఎవరి దగ్గర ఎంతెంత వసూళ్లు చేశావో బాధితులతో మీడియా సమావేశం పెట్టించమంటావా? వాళ్ల దగ్గర రూ.30 కోట్లు వసూలూ చేసింది వాస్తవం కాదా? రాజుపాలెం గ్రామంలో మాకు సంబంధించిన 200 ఎకరాల చిల్లర భూమి ఉంది. అవి డీకేనా లేక పట్టా భూములో విచారించుకో. నేను మూర్తి దగ్గర తీసుకున్న 6 కోట్ల రూపాయలు ఆయనకు, నాకు సంబంధించిన విషయం.

అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్డునే మళ్లీ వేయడం రంగులు వేయడం తప్ప నీవు ఒంగోలుకు చేసిందేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యింది. కొద్దిగా ఓపిక పట్టు. నీకు మంచి నీళ్లు కూడా తాగిపిస్తా. తొందరెందుకు నీకు..? అప్పటివరకు రెస్ట్ తీసుకో. మాకు నీ డైరెక్షన్లు అవసరం లేదు. ఒంగోలు అభివృద్దికి ఏం చేయాలో మాకు తెలుసు. మాకంటూ ఒక ప్లాన్ ఉంది. మా ప్లాన్ ప్రకారమే వెళ్తాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసిన వారిని ఎక్కడ దాచి పెడతావో, ఎంతకాలం మేపుతావో చూస్తా. ఏ పుట్టలో దాక్కున్నా లాక్కోని వస్తాం. వారిని వదలము.

మంగమూరు రోడ్డు వద్ద భూములను కొన్న చిన్న వెంకట రెడ్డిని టీడీపీలోకి పంపింది నీవు కాదా? డైలీ అతనితో నీవు మాట్లాడుతున్నది వాస్తవం కాదా? నీ కాల్ డేటా తీసి నిరూపించమంటావా? ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీవు, నీ కుమారుడు, నీ అనుచరులు చేసిన భూ అక్రమాల వేసిన సిట్ ను నీవు ఏ విధంగా మేనేజ్ చేశావో అందులో జరిగిన వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు. త్వరలో ఈ భూముల ఆక్రమణలతోపాటు నీ విల్లాలలో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకుంటాం. బాధితులకు న్యాయం చేస్తాం” అని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు.

Also Read : దమ్ము, ధైర్యం ఉంటే నా మీద పగ తీర్చుకో: బాలినేని శ్రీనివాస్ రెడ్డి