బీజేపీ పద్ధతులను అస్సలు పాటించరు.. కమలం పార్టీలో కొరకరాని కొయ్యలా మారిన ఏలేటి? రహస్య అజెండా అమలు చేస్తున్నారా?

అప్పట్లో మహేశ్వర్‌రెడ్డితో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితంగా మెలిగేవారు. వీరి గ్రూపులో మొత్తం 9 మంది ఉండగా, అందులో మహేశ్వర్‌రెడ్డి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్‌లో ఉండిపోయారు.

బీజేపీ పద్ధతులను అస్సలు పాటించరు.. కమలం పార్టీలో కొరకరాని కొయ్యలా మారిన ఏలేటి? రహస్య అజెండా అమలు చేస్తున్నారా?

Alleti Maheshwar Reddy : బీజేపీలో ఓ లెక్క ఉంటుంది… ఆ పార్టీకో పద్ధతి ఉంటుంది… సిద్ధాంతాలు అంటూ రాజకీయాలు చేసే కమలనాథులు… రాజకీయంగా ఏం మాట్లాడాలన్నా పార్టీ అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. పార్టీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తేనే… ఏ పనైనా చేయాల్సి వుంటుంది.. కానీ, తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేత మాత్రం… తన రూటే సెపరేటు అంటున్నారట… పార్టీ పద్ధతి పక్కని పెట్టి… తను చేయాలనుకున్నది చేసేస్తున్నారట… అసలే సిద్ధాంతాలు అంటూ రాద్ధాంతం చేసే కాషాయ పెద్దలు.. ఆ నేత తీరుతో విస్తుపోతున్నారట… సదరు నేతను ఎలా కంట్రోల్‌ చేయాలో తోచక జుట్టు పీక్కుంటున్నారట..? కమలం పార్టీలో కొరకరాని కొయ్యలా మారిన ఆ నేత ఎవరు?

బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు..
బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ముందుగా వివిధ స్థాయిల్లో చర్చించాలి. ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలి. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తేనే ముందుకువెళ్లాలి. రాష్ట్ర స్థాయి అంశాలైతే రాష్ట్ర పార్టీ చీఫ్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. పార్టీలో ఏ స్థాయి లీడర్‌ అయినా ఈ పద్ధతి పాటించాల్సింది. ఐతే బీజేఎల్పీ లీడర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాత్రం ఈ పద్ధతిని పాటించడం లేదట… తనకు తోచినది… తెలిసినది పార్టీ వేదికలపై బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారట. బీజేఎల్పీ లీడర్‌గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీకి సమాచారం ఉండకపోవడంతో కమలనాథులు గందరగోళం ఎదుర్కొంటున్నారట.

మహేశ్వర్‌రెడ్డి తన సొంత అజెండా అమలు చేస్తున్నారా?
పార్టీ పరంగా మహేశ్వర్‌రెడ్డిని సమర్థించాలా? తమకు సమాచారం ఇవ్వకపోవడాన్ని సీరియస్‌గా తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారట బీజేపీ పెద్దలు. ముఖ్యంగా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుంటున్న మహేశ్వర్‌రరెడ్డి దూకుడు చూపుతున్నారు. అయితే పార్టీకి సమాచారమివ్వకుండా… తను సేకరిస్తున్న సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతుండటం వల్ల మహేశ్వర్‌రెడ్డి తన సొంత అజెండా అమలు చేస్తున్నారా? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేస్తున్న మహేశ్వర్‌రెడ్డికి ఏమైనా రహస్య అజెండా ఉందా? అని బీజేపీ నేతలే ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఆ విమర్శలతో పాపులర్ అయిపోయారు..
2023 అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలోకి వచ్చిన మహేశ్వర్‌రెడ్డి… నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలోకి కొత్తగా వచ్చినా.. ఆయన సీనియారిటీ, వాగ్దాటి, సామాజిక నేపథ్యం వంటివి పరిగణలోకి తీసుకుని బీజేఎల్పీ లీడర్‌గా అవకాశమిచ్చింది పార్టీ. అయితే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆయన పలు సంచలన ఆరోపణలు చేస్తూ… ఎప్పటికప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని టార్గెట్‌ చేస్తూ ఆర్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు మహేశ్వర్‌రెడ్డి. ఈ విమర్శలు బాగా వైరల్‌ అవడంతో పార్టీలో ఆయనకు మంచి గుర్తింపే లభించింది. ఐతే, అప్పట్లో పార్లమెంట్‌ ఎన్నికలు ఉండటంతో పార్టీ కూడా ఈ విమర్శలను బాగా వాడుకుంది.

కనీసం సమాచారం ఇవ్వడం లేదని మండిపడుతున్న బీజేపీ నేతలు..
సాక్ష్యాత్తూ ప్రధాని సైతం ఆర్‌ ట్యాక్స్‌ అంటూ విమర్శలకు దిగేలా చేసింది. ఐతే ఆ తర్వాత నుంచి మహేశ్వర్‌రెడ్డి విమర్శల దాడి సొంత పార్టీకి కూడా అర్థం కావడం లేదంటున్నారు. విపక్షంలో ఉన్నారు కదా అని మహేశ్వరరెడ్డి విమర్శలను కాంగ్రెస్ లైట్‌గా తీసుకుంటే… ప్రధాన ప్రతిపక్ష పాత్రను తమ స్థానంలో బీజేపీఎల్పీ నేత కనిపిస్తుండటంతో బీఆర్‌ఎస్‌ కూడా షాక్‌కు గురవుతోందట. ఇదే సమయంలో పార్టీలో కనీస సమాచారం లేకుండా… తన రహస్య అజెండాను అమలు చేస్తున్నారని బీజేపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

సొంత పార్టీనే ఇరకాటంలో పడేస్తున్న ఏలేటి విమర్శలు..
ప్రధానంగా ప్లోర్‌లీడర్‌గా ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యత మహేశ్వర్ రెడ్డిపైనే ఉంటుంది. దీనికి రాష్ట్ర అధ్యక్షుడి సాయం కుడా తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే ఈ పనిని పెద్దగా పట్టించుకోని మహేశ్వర్‌రెడ్డి… తాను టార్గెట్‌ చేసిన నేతలు, వారి కంపెనీలపై విమర్శలకు దిగుతుండటమే చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆయన చేస్తున్న విమర్శలు పార్టీని సైతం ఇరకాటంలో పెడుతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలతోపాటు.. పార్టీకి కూడా సమాచారం ఇవ్వకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు మహేశ్వర్‌రెడ్డి. దీంతో ఎమ్మెల్యేలు, పార్టీ, మహేశ్వర్‌రెడ్డికి మధ్య సఖ్యత లేదన్న ప్రచారం మొదలైంది.

ఒకప్పటి సహచరులపైనా తీవ్ర విమర్శలు..
బీజేపీలోకి కొత్తగా రావడంతో మహేశ్వరరెడ్డి స్టైల్‌ ఎవరికీ అర్థం కావడం లేదని… వాస్తవానికి ఆయన ఎప్పుడూ డిఫరెంట్‌గా నడుస్తుంటారనే చెబుతున్నారు పరిశీలకులు. బీజేపీకన్నా ముందు కాంగ్రెస్‌లో పనిచేసిన మహేశ్వరరెడ్డి… అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితో తీవ్రంగా విభేదించే వారు. రేవంత్‌కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడిపి హీట్‌ పుట్టించే వారు. అప్పట్లో మహేశ్వర్‌రెడ్డితో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితంగా మెలిగేవారు. వీరి గ్రూపులో మొత్తం 9 మంది ఉండగా, అందులో మహేశ్వర్‌రెడ్డి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్‌లో ఉండిపోయారు. దీంతో తన చిరకాల ప్రత్యర్థిగా సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకున్నారని భావించినా…. ఇప్పుడు తనకు ఒకప్పటి సహచరులైన భట్టి, ఉత్తమ్‌లను టార్గెట్‌ చేస్తూ బీ టాక్స్‌, యూ టాక్స్‌ అంటూ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇలా వరుసగా మంత్రులపై ఆరోపణలు గుప్పిస్తున్న మహేశ్వర్‌రెడ్డి తాజాగా మరో మంత్రి పొంగులేటిని టార్గెట్‌ చేయడం చర్చకు దారితీసింది.

ఆ రహస్య అజెండా ఏంటా?
ఐతే మహేశ్వర్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఏవీ పార్టీ దృష్టికి వెళ్లడం లేదని చెబుతున్నారు. ఆయన రహస్య అజెండాతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు సంధిస్తున్నారని కమలనాథులు అనుమానిస్తున్నారు. ఆ రహస్య అజెండా ఏంటా? అని ఆరా తీస్తున్నారు. తన నియోజకవర్గానికి నిధులు సాధించుకోడానికే వరుసగా మంత్రులను టార్గెట్‌ చేస్తున్నారా? లేక బీజేఎల్పీ నేతగా పార్టీలో పట్టు పెంచుకోడానికి.. ప్రజలను ఆకట్టుకోడానికి… వన్‌ అండ్‌ ఓన్లీ… అనే సంకేతాలు పంపుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది.

Also Read : సై అంటే సై.. వరంగల్‌లో పతాక స్థాయికి ఎమ్మెల్యే‌, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్‌..!