గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? బీఆర్ఎస్‌ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.

గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? బీఆర్ఎస్‌ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

Cm Revanth Reddy : అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. అన్ని అంశాల్లో బీజేపీకి.. బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ ఊడిగం చేశారని ధ్వజమెత్తారు. చేయాల్సిదంతా చేసి ఇప్పుడు ఇతరులను కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

”2018లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్ లో పాల్గొన్నది నిజం కాదా? అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించారు. గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తింది మీరు కాదా? రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి అండగా నిలబడింది బీఆర్ఎస్ కాదా? అన్నింట్లో మద్దతు పలికి పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా వ్యవహరించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి మద్దతు పలికారు.

సాగు చట్టాల విషయంలోనూ బీజేపీకి అండగా నిలిచింది బీఆర్ఎస్. కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారు. అదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లడటానికి కాదు. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు. గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుతున్నా” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : ఆ 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అంటూ ప్రచారం..! అసలు బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ ఏంటి?