పోలవరం ప్రాజెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయనుంది, కేంద్రం ఎలా సహకరించనుంది?

ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.

పోలవరం ప్రాజెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయనుంది, కేంద్రం ఎలా సహకరించనుంది?

Polavaram Project : పోలవరం ఊపిరి పీల్చుకుందా..! పోలవరం ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలిమబ్బులు తొలగిపోయాయా..? చిక్కుముడులు వీడాయా..? ఇక ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుందా..? పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే.. అని కేంద్రం ప్రకటించడం, బడ్జెట్‌లో కూడా నిధులిచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఊపిరిలూదినట్లయ్యింది. అటు ఏపీలో చంద్రబాబు సర్కార్‌తో పాటు ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఇక మంచిరోజులొచ్చినట్లేనని అంటున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో సవాళ్లేంటి..? ఇన్నాళ్లూ నత్తనడకన సాగడానికి కారణమేంటి..? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా పూర్తి చేయాలనుకుంటోంది..? కేంద్రం దీనికి ఎలా సహకరించనుంది..?

పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరొచ్చింది, కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది..
కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పురోగతి అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన తర్వాత ఈ ప్రాజెక్టుపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. ఏళ్లు గడిచే కొద్దీ ఓపక్క పనులు నత్తనడకన సాగాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టినా.. కేంద్రం నిధులిచ్చే విషయంలో ఎన్నో అనుమానాలుండేవి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరొచ్చింది. కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది.

దేశానికి ఆహార భద్రత కల్పించే కీలకమైన ప్రాజెక్ట్..
ఇన్నాళ్లూ ఉన్న డౌట్స్‌కు చెక్‌ పెడుతూ కేంద్రమే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుందని.. అవసరమైన నిధులిస్తామని ప్రకటించడంతో పోలవరం ప్రాజెక్ట్‌ ఊపిరి పీల్చుకుంది. పనులు వేగం పుంజుకుంటాయని అంతా భావిస్తున్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదు.. దేశానికి ఆహార భద్రత కల్పించే కీలకమైన ప్రాజెక్టు అనేది కేంద్రానికి కూడా తెలుసు. అందుకే కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ పోలవరం ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు.

డీపీఆర్‌ ఆమోదం పొందకపోవడంతో ప్రాజెక్ట్‌పై నీలినీడలు..
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చే విషయంలో ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు ఉండేవి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే 33 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని 2017-18లో అంచనా వేశారు. ఈ మొత్తం నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని కూడా తెగేసి చెప్పింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఈ విషయమై సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయి. 2013-14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం 20 వేల 398 కోట్లు. ఆ అంచనాలకే కట్టుబడి ఉంటామని.. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని కేంద్రం ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. 2020 అక్టోబర్ లోనూ దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కొర్రీలు వేస్తూ గతంలో చెప్పిన నిధులను మాత్రమే ఇస్తామంటూ మొండిపట్టు పట్టింది. సవరించిన అంచనాలతో ఉన్న డీపీఆర్‌ ఆమోదం పొందకపోవడంతో ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ ఇక పూర్తి కావడం కలే అనేంత సందిగ్ధం..
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్‌ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వలేదు. కొత్త డీపీఆర్‌ ఆమోదం పొందలేదు. అలా 2 వేల కోట్లకు పైగా బిల్లులు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 నాటికి అప్పటి ధరలతో 55 వేల 548 కోట్ల రూపాయలతో రెండో డీపీఆర్‌ తయారు చేసింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం లభించింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో 47 వేల 725 కోట్ల రూపాయలకు రెండో డీపీఆర్‌కు ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రాజెక్టుకు కేవలం 20 వేల 398 కోట్లే ఇస్తామంటూ లేఖ రాసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఇక పూర్తి కావడం కలే అనేంత సందిగ్ధం ఏర్పడింది.

మంత్రిమండలి ఆమోదిస్తే తక్షణమే 12 వేల 157 కోట్లు అందుబాటులోకి..
తొలిదశ పేరుతో కొత్త డీపీఆర్‌ సమర్పించాలని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తొలిదశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవుతాయో చెప్పాలని కోరింది. ప్రస్తుతం 30 వేల 436 కోట్లకు పోలవరం తొలిదశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలిదశకు మరో డీపీఆర్‌ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే 12 వేల 157 కోట్లు అందుబాటులోకి వస్తాయి.

పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోక ముందు.. 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు భూమిని సేకరించడానికి అయ్యే ఖర్చు, ముంపు ప్రాంతాల బాధితులకు పునరావాసం కల్పించేందుకు అయ్యే వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అప్పట్లోనే భూసేకరణ, పునరావాసానికి 33 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. దీంతో 2017-18 ధరల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం 55 వేల 457 కోట్లకు రెండో డీపీఆర్‌ను పంపింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం దక్కినా.. కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇస్తుందా లేదా, ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు తొలగిపోలేదు. ఇన్నాళ్లుగా రెండో డీపీఆర్‌ అంశాన్ని కేంద్రం నాన్చుతూ వచ్చింది. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు తీపికబురు అందింది. కేంద్ర బడ్జెట్‌ రోజున ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి.

పోలవరం కల త్వరలోనే సాకారమవుతుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి..
అంతకు ముందే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం విషయంలో కేంద్రం మరో కీలకమైన ముందడుగు కూడా వేసింది. మొదటి దశ నిర్మాణానికి 12 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రకారం తొలిదశకు అవసరమయ్యే మొత్తం 30 వేల 436 కోట్ల రూపాయలు. అయితే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో 4 వేల 730 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు పెట్టిన ఖర్చును కేంద్రం ఇవ్వదని అప్పుడు తేల్చి చెప్పింది. అంటే ఈ 4వేల 730 కోట్లు పోను.. 25 వేల 706 కోట్ల రూపాయలు మాత్రమే తొలిదశకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఈ నిధులకు కూడా క్లియరెన్స్‌ లభించింది. అలాగే అవసరమైన నిధులిచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం స్వయంగా ప్రకటించింది. దీంతో పోలవరం కల త్వరలోనే సాకారమవుతుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి.

Also Read : నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?