వయనాడ్ బాధితులపై మూగజీవాల ప్రేమ.. రాత్రంతా ఆశ్రయం ఇచ్చిన ఏనుగులు!

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన వయన్మాడ్ బాధితులకు ఎటువంటి హానీ తలపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడాయి ఏనుగులు. అంతేకాదు వారికి బాధకు చలించిపోయి కన్నీళ్లు పెట్టాయట!

వయనాడ్ బాధితులపై మూగజీవాల ప్రేమ.. రాత్రంతా ఆశ్రయం ఇచ్చిన ఏనుగులు!

Wayanad landslide survivors urged elephant to spare who wept for them

heartwarming incident: ఏనుగులను దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమే. ఏం చేస్తాయోనని వణికిపోతాం. కానీ మూగజీవాలను చూసి అనవసరంగా భయపడాల్సిన పనిలేదు. మనుషుల కష్టాలను కూడా అవి అర్థం చేసుకుంటాయి. పాత రోజుల్లో మనం చాలా సినిమాల్లో చూసినట్టు కష్టాల్లో ఉన్న మనుషులను మూగప్రాణులు ఆదుకుంటాయి. అచ్చం ఇలాంటి అరుదైన ఘటనే కేరళలోని వయన్మాడ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ దగ్గరకు వచ్చిన ఓ నానమ్మ, మనవరాలికి ఎటువంటి హానీ తలపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడాయి ఏనుగులు. అంతేకాదు వారికి బాధకు చలించిపోయి కన్నీళ్లు పెట్టాయట!

అనూహ్యంగా బయటపడి..
వయన్మాడ్ ప్రళయంతో వయన్మాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇంతటి ఉత్పాతంలోనూ చురల్మలలో కుటుంబం అనూహ్యంగా బయటపడింది. సుజాత అనినంచిర అనే మహిళ ముండక్కైలోని హారిసన్స్ మలయాళం టీ ఎస్టేట్‌లోని తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. తన భర్త కుట్టన్ తో కలిసి చురల్మలలో నివసిస్తున్నారు. వీరికి సమీపంలోనే సుజాత కుమారుడు.. తన భార్య, ఇద్దరు పిల్లలతో మరో ఇంట్లో ఉంటున్నాడు. జూలై 30 రోజు రాత్రి తన మనవరాలు మృదులతో కలిసి నిద్రపోయింది. జల విలయంతో కొండ చరియలు విరిగిపడడంతో వీరి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అయితే ఈ ప్రమాదం నుంచి అనూహ్యంగా వారు ప్రాణాలతో బయటపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

“సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఏవో శబ్దాలు వినిపించడంతో అర్ధరాత్రి 1.15 అగంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది. ఏంటని చూస్తే ఫ్లోర్ అంతా పగుళ్లు తీసింది. కొద్దిసేపటికే ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది. ఛాతి వరకు శిథిలాల్లో చిక్కుకుపోయాను. అతికష్టం మీద శిథిలాల నుంచి బయటకు వచ్చాను. ఇంతలో నా మనవరాలు మృదుల ఆర్తనాదాలు వినిపించాయి. చాలా కష్టపడి ఎలాగోలాగ ఆమెను శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి బయటపడి ప్రవహించే నీటి గుండా ఈదుకుంటూ.. చివరికి సమీపంలోని కొండపైన ఉన్న తేయాకు తోటల్లోకి చేరుకున్నామ”ని ఆనాటి ఘటనను సుజాత గుర్తు చేసుకున్నారు.

ఏనుగుల ఔదార్యం
కొండపైకి ఎక్కిన తర్వాత వారికి ఎదురైన సీన్ చూసి భయంతో వణికిపోయారు. గండం గడిచిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఎదురుగా ఏనుగుల గుంపు కనబడడంతో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అయింది వారి పరిస్థితి. అయితే జలప్రళయం నుంచి తప్పించుకుని చిమ్మ చీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన వారికి ఏనుగులు ఎటువంటి హాని తలపెట్టలేదు. అంతేకాదు తమ కాళ్ల దగ్గరే వారికి చోటిచ్చి మూగప్రేమ చాటాయి.

Also Read: కేరళలో జలప్రళయం.. ప్రకృతి ప్రకోపమా.. మానవ తప్పిదమా..?

“మేము కొండపైకి వెళ్లేటప్పటికి ఆ ప్రాంతమంతా చాలా చీకటిగా ఉంది. మాకు అర మీటరు దూరంలో ఒక ఏనుగు నిలబడి ఉంది. అది కూడా భయంగా కనిపించింది. దాంతో పాటు మరో రెండు ఆడ ఏనుగులు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడే విపత్తు నుండి బయటపడ్డాం, ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడే వరకు రాత్రంతా మాకు ఆశ్రయం కల్పించమని ఏనుగులను వేడుకున్నాను. మేము ఏనుగు కాళ్లకు చాలా దగ్గరగా ఉన్నాం. మా బాధను అర్థం చేసుకున్నాయేమో.. మమ్మల్ని ఏమీ చేయలేదు. ఉదయం 6 గంటల వరకు అక్కడే ఉన్నాం. సహాయ సిబ్బంది వచ్చి మమ్మల్ని కాపాడే వరకు ఏనుగులు కదలకుండా అలాగే నిలబడి ఉన్నాయి. వాటి కళ్లు చెమర్చడం నేను చూశాన”ని సుజాత మీడియాతో చెప్పారు.

Also Read: వయనాడ్ విలయం.. ప్రమాదం సమయంలో విపరీతంగా మోగిన ఫోన్లు

సుజాత, ఆమె మనవరాలు సురక్షితంగా బయటపడిన వైనాన్ని ఎక్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ షేర్ చేశారు. “కొండచరియలు విరిగిపడడంతో నిరాశ్రయులైన బాధితులు తమ కష్టాలను ఒక ఏనుగుతో చెప్పుకున్నారు. వారి కష్టాలు విని ఆ ఏనుగు కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు.. రాత్రంతా వారికి ఆశ్రయం కల్పించింద”ని ఆయన రాసుకొచ్చారు. ఈ సంఘటన గురించి తెలిసిన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మూగజీవాల ప్రేమను కొనియాడుతున్నారు.