యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్నదానిపై..

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

యుద్ధం అంటేనే ఆయుధాలు, అగంబలంతో పని. ఇరాన్, ఇజ్రాయెల్‌ వార్‌లోనూ సేమ్‌ సీన్‌. ఆకాశమే యుద్ధభూమిగా చేసుకుని దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్‌..బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్నదానిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఏప్రిల్‌లో ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టమేమి జరగలేదు. ఇప్పుడు ఇరాన్‌ దాడులు ఎలా ఉంబోతున్నాయి..వాటిని ఇజ్రాయెల్‌ ఎలా తిప్పికొట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇజ్రాయెల్‌ది తిరుగులేని రక్షణవ్యవస్థ. ఇరాన్‌ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. 2022, 2023లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఇజ్రాయెల్ ఇరాన్‌తో పోల్చితే రెండింతల కంటే ఎక్కువ అంటే దాదాపు 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గరున్న యుద్ధవిమానాల్లో దూరం నుంచి అటాక్ చేసే.. F15, F-35 లేటెస్ట్‌ విమానాలు ఉన్నాయి. ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకుని.. స్పీడ్‌గా దాడి చేస్తాయి.

320 విమానాలు
ఇరాన్ దగ్గర దాదాపు యుద్ధ సామర్థ్యమున్న 320 విమానాలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 1960 నాటి F-4, F-5, F-14 వార్‌ జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అయితే పాత విమానాల్లో ఎన్ని పనిచేస్తున్నాయో క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరమ్ డోమ్‌దే కీరోల్‌. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అన్నింటిన్నీ ఐరమ్ డోమ్ కూల్చేసింది. ఇరాన్‌కు చెందిన 300కి పైగా క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్‌ సిస్టమ్ ఉపయోగపడింది.

ఇరాన్‌లో 6లక్షల మంది సైనికులుంటే, ఇజ్రాయెల్ దగ్గర లక్షా 70వేల మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ దగ్గర 3వేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది. షార్ట్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌, డ్రోన్లను డెవలప్ చేసింది.

ఇజ్రాయెల్‌కు పెద్ద బలం దాని ఎయిర్‌ఫోర్స్‌, ఆయుధాలే. ఇరాన్‌లో కీలక టార్గెట్స్‌పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇరాన్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారులు, నాయకులు ఇజ్రాయెల్‌ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లోనే చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ నేవీ దగ్గర 220 నౌకలు, ఇజ్రాయెల్ దగ్గర 60 నౌకలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్‌ సిస్టమ్‌ టెక్నాలజీపరంగా వీక్‌ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్‌కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు. ఇలా ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ఇరాన్‌ కంటే ఇజ్రాయెలే కాస్త అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను డెవలప్‌ చేసుకుందని అంచనాలు ఉన్నాయి.

Also Read: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సిద్ధం.. ఏ నిమిషంలోనైనా యుద్ధం ప్రారంభం: అమెరికా