2 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది, మళ్లీ వైసీపీ ఘనవిజయం ఖాయం- వైఎస్ జగన్

వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోందన్నారు జగన్.

2 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది, మళ్లీ వైసీపీ ఘనవిజయం ఖాయం- వైఎస్ జగన్

Updated On : August 13, 2024 / 7:32 PM IST

Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వంపై రెండు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే అన్ని పథకాలు ప్రజలకు చేరేవని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోందన్నారు జగన్. మళ్లీ మన పార్టీ ఘనవిజయం ఖాయం అని జోస్యం చెప్పారు జగన్.

”ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ ఈరోజుకి కూడా బతికే ఉంటుంది. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు చేసిన ఈ మోసమే కోపంగా మారుతుంది. ఈరోజు ఒక్క జగన్ లేకపోవడం, ఒక్క వైసీపీ ప్రభుత్వం లేకపోవడంతో.. ఈరోజు రావాల్సినవి ఏవీ కూడా రాకపోగా.. ఇంటికే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే పరిస్థితి కూడా పోయింది. బియ్యం, పెన్షన్లు.. ఇలా అన్నీ జన్మభూమి కమిటీల చుట్టూ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, వాళ్ల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది.

చంద్రబాబు ఇచ్చిన ప్రతి మాట మోసమే అని ఆయన పాలనతో తెలిసిపోతుంది. ప్రతి ఇంటికి ఓటు అడిగేందుకు వెళ్లి అక్కడ చిన్న పిల్లలు కనపడితే నీకు 15వేలు, నీకు 15వేలు, నీకు 15వేలు.. సంతోషమా.. అని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. జగన్ చేశాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని, జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతాను అంటున్నాడు. జగన్ కన్నా చంద్రబాబు వయసులో పెద్దోడు కదా.. జగన్ పలావు పెట్టాడు అంటే.. చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలంతా కాస్తో కూస్తో మోసపోయి చంద్రబాబు వైపు చేరిపోయారు. కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలగుతుందా అన్న ప్రశ్నకు.. ఏదైనా ఎగ్జాంపుల్ ఉంటుంది అంటే.. అది చంద్రబాబు ప్రభుత్వమే అని చెప్పొచ్చు” అని వైఎస్ జగన్ అన్నారు.

Also Read : జోగి రమేశ్‌కు మరో బిగ్ షాక్..! ఆ కేసులో పోలీసుల నోటీసులు..