Veeranjaneyulu Viharayatra : ‘వీరాంజనేయులు విహారయాత్ర’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో కచ్చితంగా చూడాల్సిన సినిమా..

‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో ఉండే ఎమోషన్స్ తో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు.

Veeranjaneyulu Viharayatra : ‘వీరాంజనేయులు విహారయాత్ర’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో కచ్చితంగా చూడాల్సిన సినిమా..

Naresh Rag Mayur Veeranjaneyulu Viharayatra Movie Review and Rating

Veeranjaneyulu Viharayatra Movie Review : సీనియర్ నటుడు నరేశ్, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని, రవి మహాదాస్యం ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వీరాంజనేయులు విహారయాత్ర’. కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా బాపినీడు, సుధీర్ నిర్మాణంలో అనురాగ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో ఈ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చారు. ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా నేడు ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే.. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో.. వీరాంజనేయులు(బ్రహ్మానందం) అనే తను రైల్వే జాబ్ చేస్తూ ఉండగా ఓ సారి గోవాకి వెళ్లడంతో ఆ ప్రాంతం బాగా నచ్చి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో గోవాలో హ్యాపీ హోమ్ అని ఇల్లు కట్టుకొని ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వెళ్ళొస్తాడు. అతను చనిపోయిన తర్వాత అస్తికలు పుణ్య నదుల్లో కలపకుండా అలాగే ఉంచుతారు. వీరాంజనేయులు కొడుకు నాగేశ్వరరావు(నరేష్) ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. మనవడు వీరు(రాగ్ మయూర్) గేమింగ్ స్టార్టప్ పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. వీరు చెల్లి సరయు(ప్రియా వడ్లమాని) ప్రేమించిన అబ్బాయి తరుణ్(రవి మహాదాస్యం)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి వీరుకి నచ్చదు.

బాగా డబ్బున్నవాళ్ళు కావడంతో తరుణ్ వాళ్ళ అమ్మ పెళ్లి, నిశ్చితార్థం గ్రాండ్ గా జరిపించాలంటుంది. అలాగే వీరాంజనేయులు అస్తికలు త్వరగా నదుల్లో కలిపేయమంటారు. అదే సమయంలో నాగేశ్వరరావు జాబ్ పోతుంది. తన చేతిలో పెళ్ళికి డబ్బులు లేకపోవడంతో గోవాలోని హ్యాపీ హోమ్ ని అమ్మేయాలని డిసైడ్ అయ్యి ఇంట్లో వాళ్లకు చెప్తే ఒప్పుకోరని తన తండ్రి అస్తికలు పుణ్య నదులతో పాటు గోవాలో కూడా కలపడానికి వెళ్తున్నామని చెప్పి కుటుంబంతో వీరాంజనేయులు వ్యాన్ లో విజయవాడ, రాజమండ్రి, గోవాకి ప్రయాణమవుతారు. ఈ క్రమంలో వీరు జాబ్ వదిలేసి బిజినెస్ లో లాస్ అయ్యాడని, సరయు ప్రగ్నెంట్ అయిందని తెలియడం, ఫ్యామిలిలో గొడవలు రావడం, తరుణ్ కూడా సరయుని పట్టించుకోకపోవడం, ఇల్లు అమ్ముతున్నాడని ఇంట్లో వాళ్ళకి తెలియడం.. ఇలా ఆ ఫ్యామిలిలో అందరి మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి ఆ ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసిందా? గోవాకు వెళ్ళారా? తమకి ఎంతో ఇష్టమైన హ్యాపీ హోమ్ ని అమ్మేశారా? తరుణ్ – వీరు కి మధ్య ఉన్న గొడవ ఏంటి? గోవా ప్రయాణంలో ఈ ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు ఏంటి? నాగేశ్వరరావు జాబ్ ఎందుకు పోయింది? వీరు ప్రేమకథ ఏంటి తెలియాలంటే ఓటీటీలో ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా చూడాల్సిందే.

Also Read : Devara – NTR : ‘దేవర’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్.. భారీ అప్డేట్..

సినిమా విశ్లేషణ.. ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమాని మొదట్నుంచి కూడా కామెడీ సినిమా అని ప్రమోట్ చేసారు. కానీ ఇందులో కామెడీ కంటే కూడా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఒక మాములు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే కష్టాలు, ఆడపిల్ల పెళ్లి ఫిక్స్ అయితే పడే కంగారు, ఓ సొంత ఇల్లుని అమ్మేయాలంటే వచ్చే బాధ, 30 ఏళ్లుగా చేసిన జాబ్ పోవడం.. ఇలా అన్ని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలుపెట్టి ఆసక్తిగా మొదలయిన కథ ఆ తర్వాత క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కోసం కొంచెం సాగదీశారు. అస్తికలు దాచిపెట్టిన చెంబుకి బ్రహ్మానందం వాయిస్ ఇచ్చి కామెడీ బాగానే పండించారు.

ఇక ఫ్యామిలీ అంతా గోవా ప్రయాణం అయిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. అక్కడ్నుంచి ఇదొక ట్రావెల్ ఫిలిం అనిపిస్తుంది. నాలుగు రాష్ట్రాలలో ట్రావెల్ చేసి ఆ సీన్స్ అన్ని తెరకెక్కించడం గమనార్హం. ఇక సెకండ్ హాఫ్ ఇంట్లో అందరికి సమస్యలు, వారి మధ్య విభేదాలు, ఇల్లు ఎమోషన్.. ఇలా అన్ని కూడా చాలా మంచి ఎమోషన్ తో చూపించి ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తారు. క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఏడ్వాల్సిందే. ఓ పక్క కామెడీతో నవ్విస్తూనే మరో పక్క ప్రేక్షకులని ఏడిపిస్తుంది ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అయితే రొమాంటిక్ పాత్రల్లో నటించిన ప్రియా వడ్లమాని చెల్లి పాత్రలో అంత తొందరగా తీసుకోలేము. రాగ్ మయూర్ కి చెల్లిగా సెట్ అవ్వలేదనిపిస్తుంది.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎన్నో సినిమాలతో మనందరినీ మెప్పించిన నరేష్ ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మరోసారి మెప్పించారు. సినిమా బండి సినిమాలో తన కామెడీతో అందర్నీ నవ్వించిన రాగ్ మయూర్ ఈ సినిమాలో ఎమోషనల్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఇతనిలో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ ప్రియా వడ్లమాని సింపుల్ గా అలరించింది. నరేష్ భార్య పాత్రలో ప్రియదర్శిని అనే సీరియల్ నటి కూడా మంచి ఎమోషన్ తో మెప్పించింది. బామ్మ పాత్రలో శ్రీలక్ష్మి కూడా కామెడీతో పాటు ఎమోషన్ పండించారు. సినిమా అంతా తన వాయిస్ ఇచ్చి చివర్లో అలా ఒక సారి కనిపించి సందడి చేసారు బ్రహ్మానందం. రవి మహాదాస్యం, తరుణ.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో బాగా నటించారు.

సాంకేతిక అంశాలు.. ట్రావెల్ ఫిలింకి సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని చక్కగా చూపించారు. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతంగా ఇచ్చారు. ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కట్ చేసారు. దర్శకుడిగా అనురాగ్ మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. ఇక నిర్మాణ పరంగా చిన్న సినిమానే అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో ఉండే ఎమోషన్స్ తో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.