మృతుల కుటుంబాలకు వెంటనే రూ.కోటి చెక్కు ఇచ్చాం, అప్పటికప్పుడు రూ.30 కోట్లు సిద్ధం చేశాం- బొత్స సత్యనారాయణ

సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు వెనక్కి పోతాయని మాట్లాడటం అవగాహన రాహిత్యం..

మృతుల కుటుంబాలకు వెంటనే రూ.కోటి చెక్కు ఇచ్చాం, అప్పటికప్పుడు రూ.30 కోట్లు సిద్ధం చేశాం- బొత్స సత్యనారాయణ

Atchutapuram SEZ Incident : ఎల్జీ పాలిమర్ ప్రమాద ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, మృతుల కుటుంబాలకు వెంటనే రూ.కోటి చెక్కు ఇచ్చిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అచ్యుతాపురం సెజ్ ఘటనలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని బొత్స ఆరోపించారు. బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాతే.. చంద్రబాబు స్పందించారని, కేజీహెచ్ కు వచ్చారని బొత్స చెప్పారు. బాధితులకు కనీసం మంచి నీళ్ల బాటిల్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మృతులు కుటుంబాలకు, గాయపడ్డ వారికి వైసీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున సాయం ప్రకటించింది.

”ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులను ప్రభుత్వం నుంచి ఎవరూ పరామర్శించలేదు. సహాయ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే మేము సంఘటన స్థలానికి చేరుకున్నాము. ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. టీడీపీ నేతలు స్థాయి మరచి విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమీ జరగలేదని మాట్లాడుతున్నారు. ఎల్జీ పాలిమర్ ప్రమాదం జరిగిన వెంటనే చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్కులు అందించాము. అప్పటికప్పుడు రూ.30 కోట్లు సిద్ధం చేశాం. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనలో పరిశ్రమ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదని మంత్రి మాట్లాడడం సరైన పద్ధతేనా? సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు వెనక్కి పోతాయని మాట్లాడటం అవగాహన రాహిత్యం” అని ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ.

 

Also Read : ఉచ్చు బిగుస్తోందనే అసమ్మతి గళమా..! వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన మాజీ ఎంపీ తీరు..