YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్‌ తగలనుందా?

ప్రస్తుతానికి మోపిదేవి, మస్తాన్‌రావు జంపింగ్‌కు లైన్‌క్లియర్‌ కాగా, మిగిలిన వారు కూడా త్వరలో గోడదూకేస్తారన్న టాక్‌ వైసీపీని..

YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్‌ తగలనుందా?

వైసీపీకి బిగ్‌ షాక్‌ తగలనుందా? మెజార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేసేలా అడుగులు వేస్తున్నారా? పార్టీలో నెంబర్‌ టు లీడర్‌ నుంచి అధినేతతో కలిసి కేసులు ఎదుర్కొన్న నేతలు వరకు దాదాపు ఏడెనిమిది మంది వైసీపీ వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? బలం అనుకున్న నేతలే… బైబై చెప్పేయాలని నిర్ణయించుకోడానికి కారణమేంటి? అధికార పార్టీ ఆకర్ష్‌ పనిచేసిందా? వైసీపీలో తగిన గౌరవం దక్కలేదని అసంతృప్తే పార్టీని వీడేలా చేస్తోందా? వైసీపీలో ఏం జరుగుతోంది…..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఇప్పటికే నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, ఇప్పుడు సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులు ఫ్యాన్‌ పార్టీకి హ్యాండిస్తారని ప్రచారం జరుగుతోంది. అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్‌ పుట్టిస్తోంది.

మోపిదేవితో పాటు గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడైన నెల్లూరు నేత బీద మస్తాన్‌రావు సైతం మళ్లీ సొంత గూటికి చేరిపోనున్నారని చెబుతున్నారు. ఈ ఇద్దరూ తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతారంటున్నారు. మోపిదేవి సొంత నియోజకవర్గం నుంచి రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మోపిదేవిని ఓడించిన సత్యప్రసాద్‌… గత ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి మంత్రి అయ్యారు.

అప్పట్లో ఒత్తిడి కారణంగా వైసీపీలోకి?
తన రాజకీయ ప్రత్యర్థి అయిన మోపిదేవి చేరికను మంత్రి సత్యప్రసాద్‌ కూడా స్వాగతించినట్లు చెబుతున్నారు. ఇక మరో ఎంపీ బీద మస్తాన్‌రావు సోదరుడు బీద రవిచంద్ర నెల్లూరు జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసిన మస్తాన్‌రావు ఆ తర్వాత ఒత్తిడి కారణంగా వైసీపీలోకి వెళ్లినట్లు చెబుతున్నారు.

ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడం.. సోదరుడు, కుటుంబం నుంచి ఒత్తిడి పెరగడంతో మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేస్తూ ప్రకటన చేశారు. సునీతతోపాటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా పార్టీ వీడనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సునీత రాజీనామాతో మిగిలిన వారి నిర్ణయంపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

మరోవైపు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా నిర్ణయం వైసీపీలో కలకలం సృష్టిస్తుండగా, ఈ లిస్టులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల్లో ఎంత నిజముందోగానీ, ఎన్నికలకు కొద్దిరోజులు ముందు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గొల్ల బాబూరావు, మేడా రఘురామిరెడ్డి సైతం టీడీపీతో టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. అదేవిధంగా మరో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ఆసక్తి రేపుతోంది. గతంలో ఈ ప్రచారాన్ని బోస్‌ ఖండించినా, మోపిదేవి ఎపిసోడ్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.

వైసీపీలో కీలక నేతలుగా చెప్పుకున్న వారంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతుండటంతో రాజకీయంగా హీట్‌ పెరిగిపోతోంది. ప్రస్తుతం వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు రాజీనామా చేసిన ఆ సీటు టీడీపీ-జనసేన కూటమి లెక్కల్లో చేరడం ఖాయం. అసెంబ్లీలో కూటమికి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఇకపై జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీలే గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మార్చిలోనే రాజ్యసభ ఎన్నికలు జరగడంతో మళ్లీ రెండేళ్లవరకు టీడీపీ పెద్దలసభలో అడుగు పెట్టే పరిస్థితి లేదు.

పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌
ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే.. ఆ సీట్లన్నీ టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు ఉండటంతో సీఎం చంద్రబాబు సైతం వైసీపీ ఎంపీలు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ ఎంపీకి చెందిన 11 మంది ఎంపీల్లో మాజీ సీఎం జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, రిలయన్స్‌ సంస్థలకు చెందిన పరిమళ్‌ నత్వానీ, జగన్‌ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డి మాత్రమే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ఈ ముగ్గురిలో పరిమల్‌ నత్వానీకి రాజకీయాలతో సంబంధం లేకపోవడం, నిరంజన్‌రెడ్డి తెలంగాణ వాసి కావడంతో ఆ ఇద్దరూ పార్టీలో ఉన్నా, లేకున్నా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు.

ఇక మిగిలిన వారిలో జగన్‌కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు ఉన్న మోపిదేవి, బోస్‌, గొల్ల బాబూరావు, రఘురామిరెడ్డి పార్టీ ఫిరాయింపులకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఫ్యాన్‌ పార్టీలో కలవరం పుట్టిస్తోంది. ఇదేసమయంలో పార్టీలో నెంబర్‌ 2గా చెప్పే విజయసాయిరెడ్డిపైనా ఈ తరహా ప్రచారం జరుగుతుండటంతో కలకలం రేపుతోంది.

ప్రస్తుతానికి మోపిదేవి, మస్తాన్‌రావు జంపింగ్‌కు లైన్‌క్లియర్‌ కాగా, మిగిలిన వారు కూడా త్వరలో గోడదూకేస్తారన్న టాక్‌ వైసీపీని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిస్థితిని అధినేత జగన్‌ ఎలా చక్కదిద్దుతారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వలసలను వదిలేసినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పును లైట్‌గా తీసుకుంటారా? లేక అసంతృప్తితో ఉన్న వారిని నచ్చజెప్పి పార్టీలో కొనసాగేలా చూస్తారన్నది చూడాల్సివుంది.

Also Read: నామినేటెడ్ పోస్టుల భర్తీపై సస్పెన్స్ ఇంకెన్నాళ్లు?