అలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమే- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమే- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

Updated On : August 28, 2024 / 9:23 PM IST

Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమే అని అన్నారు. ఇక, వైసీపీని వీడి టీడీపీలో చేరాలని చూస్తున్న నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వచ్చే వారికి షరతులు విధించారాయన. వైసీపీలో ఇమడలేక ఎవరైనా మా వైపు వస్తుంటే పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తేనే తీసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా, కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ”ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి ఎవరు రావాలనుకున్నా రాజీనామా చేసే రావాలి. వ్యక్తిత్వం, సత్తా చూపే ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటాం. రాజకీయాల్లో విలువలు పాటించాలి” అని చంద్రబాబు అన్నారు.

”పార్టీ బలోపేతానికి ఎవరు అవసరమో ఎగ్జామిన్ చేస్తాం. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపటం సమాజానికి చాలా ప్రమాదం. ఇప్పటికే కాదు ఎప్పటికైనా ప్రమాదకరమే. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఐదేళ్లు ఎంత నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. లక్ష కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. డబ్బులు ఇవ్వకపోతే చావే శరణ్యం అని కొందరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కియా మోటర్స్ తేవడానికి సౌత్ కొరియాకు నేను వెళ్లాను. వైసీపీ నేతలు చేసిన దౌర్భాగ్యం మమ్మల్ని వెంటాడుతోంది. భయంకరమైన నెట్ వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి తీసుకొచ్చారు. చాలా బాధగా, ఆవేదనగా ఉంది.

Also Read : వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!

ఎక్కడా లేని పాలసీలు ఏపీలో తీసుకొచ్చారు. మీ బ్రాండ్ మీరు తయారు చేసుకునే అధికారం వారికి ఎవరిచ్చారు? జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ ఉన్నాయి. కంపెనీలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా అదే ప్రొఫెషన్ లో ఉన్నాయి. లిక్కర్ తయారీకి స్టాండర్డ్స్ లేవా. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? బ్లూ మీడియాలో దుష్ప్రచారం చేస్తారా? రాజకీయాల్లో విలువలు లేకపోతే ఎలా? కనీస నైతిక విలువలు లేకుండా రాజకీయాలు చేయడం ఏంటి? ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చూసి నాకు చాలా బాధ, ఆవేదన కలుగుతోంది. ఇలాంటోళ్లతో నేను పోరాడాల్సి వస్తోందని బాధగా ఉంది. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నామోషి.

మొన్నటి దాకా బూతులతో విరుచుకుపడ్డారు. ఇప్పుడా బూతులు లేవు. ఆ బూతులు మాట్లాడే నోళ్లకు తాళాలు పడ్డాయి. ఐదేళ్లు ఎన్ని బూతులు మాట్లాడారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరన్నా బూతులు మాట్లాడుతున్నారా? మాకు నోర్లు లేవా, చేతకాదా బూతులు మాట్లాడేందుకు. ఎందుకు మాట్లాడం లేదు. ఇద్దరి మధ్య తేడాను అందరూ గమనిస్తున్నారు. ఎన్నో అరాచకాలు చేశారు. ప్రజలు, మీడియాపై దాడులు చేశారు. పరదాలు కట్టారు. పైశాచికంగా ప్రవర్తించారు” అని వైఎస్ జగన్, వైసీపీ నాయకులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు.