అది కాంగ్రెస్ కండువా కాదు దేవుడి కండువా..! పార్టీ మారిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేల సరికొత్త వాదన..

ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా... కాంగ్రెస్‌ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్‌ఎస్‌.

అది కాంగ్రెస్ కండువా కాదు దేవుడి కండువా..! పార్టీ మారిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేల సరికొత్త వాదన..

Gossip Garage : కాంగ్రెస్‌ కండువా… బీఆర్‌ఎస్‌ కండువా.. బీజేపీ కండువా… ఒక్కో పార్టీది ఒక్కో రంగు.. ఏ రంగు కండువా కప్పుకుంటే ఆ పార్టీలో సాంకేతికంగా చేరినట్లే భావిస్తారు. గులాబీ కండువా తీసేసి మూడు రంగుల కండువా కప్పుకున్న వారు ఎవరైనా కాంగ్రెస్‌ నేతలుగానే చెలామణి అవుతారు.. కానీ తెలంగాణ పాలిటిక్స్‌లో మూడు రంగుల కండువాకు కొత్త పేరు పెట్టారు. దాని పేరు దేవుడి కండువా… రాజకీయాలకు దేవుడికి లింకేంటి? అని డౌట్‌ పడుతున్నారా? అదే.. ఆ పాయింటే ఏంటో క్లియర్‌గా చెబుతాం చూడండి…

అనర్హత వేటు నుంచి తప్పించుకోడానికి దేవుడి కండువాలుగా కలరింగ్‌..
పార్టీ ఫిరాయింపులు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. పార్టీ మారిన ముగ్గురిపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోగా, అందులో ముగ్గురిపై కోర్టులో కేసు వేసింది బీఆర్‌ఎస్‌. ఆ ముగ్గురిపై చర్యలకు కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మిగిలిన ఏడుగురు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. మేము పార్టీ మారలేదని చెబుతుండటంతోపాటు తమ మెడలో వేసిన మూడు రంగుల కండువాలు దేవుడి కండువాలుగా ప్రచారం మొదలుపెట్టారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోడానికి తాము పార్టీ మారలేదని చెప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్‌ కండువాకు పేరు మార్చి దేవుడి కండువాలుగా కలరింగ్‌ ఇవ్వడమే ఆసక్తికరంగా మారింది.

హైకోర్టు ఆదేశాలతో అలర్ట్ అయిన ఏడుగురు ఎమ్మెల్యేలు..
బీఆర్‌ఎస్‌ నుంచి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, అందులో ముగ్గురు పార్లమెంట్‌ ఎన్నికల ముందు మూడు రంగుల కండువా కప్పుకున్నారు. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండాలు పట్టుకుని ప్రచారం చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కనుక వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్‌. ఆ తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పైనే రెండు రోజుల క్రితం అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది హైకోర్టు. దీంతో మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు అలర్ట్‌ అయ్యారు.

సీఎంను కలిస్తే దేవుడి కండువా కప్పి సత్కరించారని ప్రచారం..
అనర్హత వేటు వేయించుకుని ఎక్కడ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోందననే ఆలోచనతో అబ్బే… తాము పార్టీ మారలేదని… అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని చెబుతున్నారు. అంతేకాకుండా సాంకేతికంగా తాము కప్పుకున్నది కాంగ్రెస్‌ కండువా కాదని… కాంగ్రెస్‌ కండువా అయితే దానిపై ఆ పార్టీ గుర్తు, పార్టీ అధ్యక్షుల ఫొటోలు ఉండాలి కదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాము సీఎంను కలిస్తే దేవుడి కండువా కప్పి సత్కరించారని ప్రచారం స్టార్ట్‌ చేశారు.

ఇలా దేవుడి కండువాలు కప్పుకున్నామంటున్న ఎమ్మెల్యేల వాదనలను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తే.. తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనని వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే గాంధీ…

దేవుడి కండువాలన్న వాదన ఎత్తుకున్న జంపింగ్ ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యే వాదన ఇలా ఉంటే… ఆయన సోషల్‌ మీడియా అకౌంట్లలో కాంగ్రెస్‌లో చేరినట్లు ఎమ్మెల్యే గాంధీ స్వయంగా ప్రకటించిన పోస్టుల సంగతేంటి? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇక గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి చేసిన పోస్టును ట్రోల్‌ చేస్తున్నారు. ఒక్క గాంధీయే కాదు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు తప్ప మిగిలిన ఏడుగురు దేవుడి కండువాలన్న వాదనే ఎత్తుకున్నారు.

Also Read : తీవ్ర ఆవేదనలో చొప్పదండి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు..! కారణం ఏంటంటే..

బీఆర్‌ఎస్‌ చర్యలకు విరుగుడుగా దేవుడి కండువాలన్న కొత్త వాదన..
వాస్తవానికి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే… ఇంకో పార్టీ వేదికలపై కనిపించడంగానీ, ఆ పార్టీ జెండాలు, చిహ్నాలను ప్రచారం చేయడం, సొంత పార్టీ నేతలను విమర్శించడం.. వంటివి ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకే వస్తాయి. ఇలా ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా… కాంగ్రెస్‌ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్‌ఎస్‌. దీంతో బీఆర్‌ఎస్‌ చర్యలకు విరుగుడుగా దేవుడి కండువాలు అన్న కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు జంపింగ్‌ ఎమ్మెల్యేలు. స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ, ఎమ్మెల్యేల కొత్త వాదన మాత్రం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.