Harvesting Chillies : మిరపలో కోతకు ముందు, కోత తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో ఒక రోజంతా కప్పి ఉంచితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలను పాలిథీన్‌ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై కాయల్ని ఆరబెట్టకూడదు.

Harvesting Chillies : మిరపలో కోతకు ముందు, కోత తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Harvesting Chillies

Harvesting Chillies : కాయ కోతకు కనీసం 15 రోజుల ముందు నుండి ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు పిచికారి చేయరాదు. కోతకు ముందు పంటకు నీటి తడులివ్వాలి. కోతకు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు తిరిగిన కాయలను వాతావరణం పొడిగా ఉన్న సమయాల్లో మాత్రమే కోయాలి.

READ ALSO : Chilli Cultivation : మిరపలో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి

కాయల్ని మొక్క మీద మరీ ఎక్కువగా పండనిస్తే కాయలు ముడతలు పడమేకాకుందా, సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి. వీలైనంత వరకు కాయకుళ్ళు తెగులు, కాయ తొలుచు పురుగు ఆశించిన కాయలను కోత సమయంలో వేరుచేయాలి. సరైన సమయంలో తరచుగా ఎప్పటికప్పుడు పండిన కాయలు కోయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. వర్షాధార పంటలో 3-4 కోతలు నీటితడి పంటలో 6-8 కోతలు వస్తాయి.

కోత అనంతర జాగ్రత్తలు :

కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో ఒక రోజంతా కప్పి ఉంచితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలను పాలిథీన్‌ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై కాయల్ని ఆరబెట్టకూడదు.

నేల మీద అరబెడితే బూజు పట్టే అవకాశం చాలా ఎక్కువ. మంచు బారిన పడకుండా రాత్రిపూట కాయలను సిలికాన్‌ పట్టాలతో కప్పి ఉంచాలి. మిరపకాయలను పలుచగా పోసి రోజూ తిరగతిప్పుతూ ఉండాలి. కాయలు బాగా ఎండకపోతే రంగును, మెరుపును త్వరగా కోల్పోతాయి.

READ ALSO : Chilli Cultivation : మిరపలో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

కాయల్లో తేమ 10-11 శాతం వరకు వచ్చేలే ఎండబెట్టాలి. ఎందబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం కాయల్లో చేరకుండా చూడాలి. కాయలు ఎండబెడుతున్నప్పుడు దరిదాపుల్లో కోళ్ళు, కుక్కలు, ఎలుకలు రాకుండా చూడాలి. తాలు కాయలు, తెగులు ఆశించిన కాయలు ఏరి వేరు చేయాలి.

ఎండు కాయలను టిక్కీలలో (గోనె సంచులు) నింపేటప్పుడు కాయలపై నీరు చల్లకూడదు. నిల్వ చేసిన బస్తాలకు తేమ తగలకుండా అడుగున చాపలు లేదా వరిపొట్టు, కర్రచెక్కలు లాంటివి పరచాలి. గోడల నుండి 50-60 సెం.మీ. ఎడంగా బస్తాలను పేర్చాలి.

READ ALSO : Chilli Cultivation : మిరప నార్లు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం పాటించాల్సిన యాజమాన్యం

అవకాశమున్న చోట శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేస్తే కాయలు 8-10 నెలల వరకు రంగు, నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. కాయలు మంచి రంగు రావడానికి నిషేదిత కృత్రిమ రంగులను వాడరాదు. కాయలు నింపిన గోదాలపై రోడోమిన్‌-బి కలిగిన మార్కరు వాడరాదు. పురుగులు, ఎలుకలు నిల్వ చేసిన ప్రదేశం దరిదాపులకు రాకూడదు. నిల్వ చేసిన మిరపకాయలను అప్పుడప్పుడూ ఎండబెడుతూ ఉండాలి.