విద్యాదీవెన పథకం వెనుక ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య.. అసలేం జరిగిందో చెప్పిన సీఎం జగన్

విద్యాదీవెన పథకం వెనుక ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య.. అసలేం జరిగిందో చెప్పిన సీఎం జగన్

కష్ట కాలంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు అండగా నిలిచారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం జగనన్న విద్యాదీవెన పథకాన్ని మంగళవారం (ఏప్రిల్ 28,2020) ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. విద్యా దీవెనలో భాగంగా రెండు పథకాలు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. బోర్డింగ్, లాడ్జింగ్, పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు మాత్రమే అని అన్నారు.

విద్యాదీవెన పథకం తీసుకురావడం వెనుక కారణం:
కాగా, విద్యాదీవెన పథకం రూపకల్పన ఆలోచన ఎలా వచ్చింది? ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారు? ఏ సందర్భంలో అలాంటి ఆలోచన వచ్చింది? దీనికి సంబంధించి సీఎం జగన్ స్పందించారు. విద్యాదీవెన పథకం ప్రారంభించడానికి ప్రేరణ ఏంటో తెలిపారు. నాడు తనను కంటతడి పెట్టించిన ఓ ఘటనను సీఎం గుర్తు చేసుకున్నారు.

తన చదువు కోసం తండ్రి పడుతున్న బాధలు చూడలేక విద్యార్థి ఆత్మహత్య:
నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్ అనే తండ్రి తన ఇంటి ముందు కొడుకు ఫోటో పెట్టి నివాళులు అర్పిస్తున్నాడని… ఆ సమయంలో ఏమైందని అడగగా ఆ తండ్రి బాధ పడుతూ ఇంటర్ లో తన కొడుకుకు మంచి మార్కులు రావడంతో ఇంజనీరింగ్ లో చేర్పించానని ఫీజులు, బోర్డింగ్, లాడ్జింగ్ ఫీజులు లక్ష రూపాయలు దాటే పరిస్థితి నెలకొందని చెప్పాడని జగన్ అన్నారు.

ప్రభుత్వం చాలీచాలని ఫీజులను చెల్లించేదని, బ్యాలెన్స్ ఫీజు ఏం చేస్తావు నాన్నా అని కొడుకు అడగగా అప్పో సొప్పో చేసి కడతానని ఆ తండ్రి చెప్పడంతో ఆ విద్యార్థి తన కుటుంబం ఇబ్బందులు పడటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ తెలిపారు. ఆ ఘటన తనను చాలా బాధించిందని జగన్ వాపోయారు. నాటి ఘటనను గుర్తు చేసుకుని మరోసారి ఆవేదనకు గురయ్యారు. ఆరోజే రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని నిర్ణయం తీసుకున్నానని… అందువల్లే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రారంభించానని సీఎం జగన్ తెలిపారు.

పేద విద్యార్థుల తలరాతలు మారాలి:
ప్రతి ఒకరు చదువుకోవాలి.. పేద విద్యార్థులందరి తలరాతలు మారాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ కోసం జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీవినీ ఎరుగని పథకాలను ప్రవేశ పెట్టారు. పేద విద్యార్థుల పాలిట వరాలు కురిపించారు.

పేదల ముఖాల్లో చిరునవ్వులు:
మా తలరాతలు ఇంతే పెద్ద చదువులు మాకు రాసిపెట్టి లేవు అని నిరాశతో ఉన్న పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్య వసతి దీవెన పథకం అందులో భాగమే. బోర్డింగ్, లాడ్జింగ్ కు జగన్ అన్న వసతి దీవెన పథకం కింద ఏకంగా విద్యార్థులకు 20 వేల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది. త్రైమాసికం పూర్తవగానే ఫీజుల నగదు విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతుంది.

నాడు వైఎస్, నేడు జగన్:
గతంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య కొరకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. నాడు పేదోడు కూడా మెరుగైన విద్య పొందే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు వైఎస్ రాజశేఖర రెడ్డి… నేడు పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకానికి జగన్ ఊపిరి పోశానని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు.